చిరంజీవి, రామ్‌చరణ్‌లకే నో చెప్పిందా..?

Update: 2022-06-08 14:30 GMT
సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసినప్పుడు కచ్చితంగా ఉండే ప్రశ్న.. మీ దగ్గరికి వచ్చిన ఏదైనా మంచిపాత్రను వదులుకున్నారా..? అని. దానికి చాలా మంది సమాధానం అవుననే ఉంటుంది. ఆ సమయంలో షెడ్యూల్ సమస్యనో.. లేక కథ నచ్చకో.. ఇతర కారణాలతో సినిమాకు ఒప్పుకోక అది హిట్ అయిన తర్వాత అయ్యో మిస్ అయిపోయామే అనుకోవడం సాశాదరణమే. అయితే అలా నో చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా బోలెడున్నాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. ప్రస్తుతం అటు బాలీవుడ్‌లో ఇటు సౌతిండియాలో తన సత్తా చాటుతున్న రష్మిక మందన్న తన కెరీర్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు వదులుకుంది. ఇంతకీ అవేంటంటే..?

నేషనల్ క్రష్.. కుర్రాళ్ల గుండెల్లో తనదైన ముద్ర వేసిన రష్మిక మందన్న తన సినీ కెరీర్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు వదులుకుంది. ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర చేసిన పాత్రకు ముందుగా రష్మికను సంప్రదించారట. కానీ ఆమె కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె చిరంజీవి, రామ్‌ చరణ్‌లకు నో చెప్పేసింది. ఆ సినిమా ఫలితాలు చూస్తుంటే ఆ సమయంలో రష్మిక నో చెప్పి మంచి పనే చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఏదైనా సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు రీమేక్‌లోనూ ఒరిజినల్ సినిమాలో చేసిన యాక్టర్లు నటించడానికి ఇష్టపడరు. ఈ విషయానికొస్తే రష్మిక కూడా అంతే. కన్నడలో సూపర్ హిట్‌ అయిన కిరిక్ పార్టీను బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక పాత్ర కోసం ముందు ఆమెనే సంప్రదించగా.. తను నో చెప్పింది. ఇక చేసేదేం లేక ఆ చిత్ర నిర్మాతలు తర్వాత కృతి సనన్‌ను ఓకే చేశారు.

తెలుగులో న్యాచురల్ స్టార్‌ నాని తన నటనతో మెస్మరైజ్ చేసిన సినిమా జెర్సీ. దీన్ని హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటించారు. ఇందులో కథానాయికగా ముందుగా రష్మికను సంప్రదించగా.. ఇందులో కిస్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆమె రిజెక్ట్ చేసింది. తర్వాత ఈ పాత్రను మృణాల్ ఠాకూర్ చేసింది.

కరోనా తర్వాత థియేటర్‌లో విడుదలై ఒక ఊపు ఊపిన సినిమా మాస్టర్. తమిళ హీరో విజయ్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ పాత్ర మొదట రష్మికనే వరించింది. కానీ తన పాత్ర నిడివి తక్కువ ఉండటంతో ఈ సినిమాకు రష్మిక నో చెప్పింది. తర్వాత మాళవిక మోహన్‌తో సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం తన ఫేవరెట్ హీరో విజయ్‌తో రష్మిక వంశీపైడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తోంది.

తన ఫేవరెట్ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ రష్మిక మాత్రం రెండు సార్లు ఆ అవకాశాన్ని రిజక్ట్ చేసింది. అయినా ఆమెకు మూడో సారి అవకాశం కలిసొచ్చింది. ఈ సారి తను ఆ ఛాన్స్‌ను పట్టేసుకుంది. తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ముందు రష్మిక వద్దకే వచ్చింది. కానీ కథ నచ్చకో.. అందులో తన పాత్ర నచ్చకో రష్మిక దీనికి కూడా నో చెప్పేసింది. ఇలా ఆ పాత్ర పూజా హెగ్డే చేతిలోకి వెళ్లింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న సినిమా.. అంటే.. సుందరానికీ. ఈ సినిమా కోసం ముందుగా రష్మికను ఓకే అనుకున్నారు. కానీ ఆమె ఆ సినిమా చేయనని చెప్పడంతో మలయాళీ భామ నజ్రియా నజీమ్‌ను సంప్రదించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి పోషించిన పాత్రకు ముందుగా రష్మికనే అడిగారట. కానీ ఆ పాత్రకు కూడా నో చెప్పింది. RC 15 రామ్‌ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం ముందుగా రష్మికను సంప్రదించారు. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల కియారా అద్వాణీ ట్రాక్‌లోకి వచ్చింది. రామ్‌ చరణ్‌తో నటించే ఛాన్స్ రెండు సార్లు కోల్పోయిన రష్మిక మూడో అవకాశాన్ని మాత్రం వదులుకోలేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యూవీ క్రియేషన్స్‌లో ఓ పాన్ ఇండియా చేయబోతున్నాడు రామ్‌చరణ్‌. ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మహా సముద్రం. ఇందులో మహా పాత్ర కోసం ముందుగా సమంతను సంప్రదించారు. ఆమె నో చెప్పడంతో రష్మికను అడిగ్గా.. ఆమె కూడా రిజెక్ట్ చేసింది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ రష్మిక పలు ఆఫర్లను తిరస్కరించింది. కథ నచ్చి.. తన పాత్రకు ప్రాధాన్యం ఉందనిపిస్తే తప్ప రష్మిక అంత ఈజీగా సినిమాకు ఓకే చెప్పదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె వదులుకున్న సినిమాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
Tags:    

Similar News