సీక్వెల్ దిశగా రవితేజ 'విక్రమార్కుడు'

Update: 2021-09-19 01:30 GMT
రవితేజ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'విక్రమార్కుడు' ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర రవితేజకు మంచి పేరు తీసుకొచ్చింది. అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగులో విజయవిహారం చేసింది. వివిధ భాషల్లో రీమేక్ అయింది. కీరవాణి పాటలు ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. 'జింతాతా జితా జితా .. ' అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.

ఏ భాషలో రీమేక్ చేస్తే ఆ భాషలో విజయవంతమైన ఇంత గొప్ప కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. మళ్లీ ఇంతకాలానికి ఆయన 'విక్రమార్కుడు' సీక్వెల్ కి కథను సిద్ధం చేశాడట. అంతకుమించి అన్నట్టుగా ఈ కథ వచ్చిందని అంటున్నారు. సాధారణంగా ఆయన ఏ కథను రెడీ చేసినా ముందుగా రాజమౌళికి ప్రాధాన్యతనిస్తారు. ఆయన అయితే తన కథకి న్యాయం జరుగుతుందని విజయేంద్ర ప్రసాద్ భావిస్తారు. కానీ రాజమౌళి మరో రెండు మూడేళ్ల వరకూ బిజీ నట. అందువలన ఆయన తన కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

గతంలో 'విక్రమార్కుడు' సాధించిన సంచలన విజయం .. రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి గల పేరు కారణంగా బడా నిర్మాణ సంస్థలు ఈ కథను సొంతం చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయట. ఆయన ఈ కథను పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా మలచడమే నిర్మాతలు పోటీ పడటానికి కారమణమని చెప్పుకుంటున్నారు. మరి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను ఏ నిర్మాణ సంస్థకి అప్పగిస్తారో .. ఏ దర్శకుడికి అప్పగిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఇదే ప్రధానమైన చర్చగా మారిపోయింది.

రాజమౌళి తరువాత తెలుగులో ఈ తరహా మాస్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో, వినాయక్ .. పూరి సిద్ధహస్తులు. ఇక ఇదే కంటెంట్ ను కాస్త స్టైలిష్ గా తెరకెక్కించాలంటే సురేందర్ రెడ్డి వల్లనే అవుతుంది. అందువలన ఈ ముగ్గురిలో ఒకరు 'విక్రమార్కుడు' సీక్వెల్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుతం ఈ ముగ్గురూ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. మరి వాళ్లలో ఎవరో ఒకరు ఖాళీ అయ్యేవరకూ ఈ కథ ఆగుతుందా? మరో దర్శకుడిని సెట్ చేసుకుని సెట్స్ పైకి వెళుతుందా? అనేది చూడాలి.


Tags:    

Similar News