ఈ మామా అల్లుళ్లకు ఏమైంది?

Update: 2018-08-02 06:25 GMT

తమిళ్ లో ఒక క్రేజీ సినిమా రూపొందుతుంది అంటే దానికి తెలుగులో కూడా మార్కెట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ నిజం గుర్తించే రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి హీరోలు దశాబ్దాల పాటు ఇక్కడ కూడా గట్టిగా పాగా వేయగలిగారు. సూర్య కార్తీలు ఇప్పటికీ ఒక సినిమా సైన్ చేసే ముందు తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుని మరీ జాగ్రత్త పడతారు. గతంలో శంకర్ తీసిన భారతీయుడు-బాయ్స్ లాంటి సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే మెరుగైన వసూళ్లు దక్కించుకున్నాయి. సింగం సిరీస్ సూర్యకు తెచ్చిన పేరు చూస్తూనే ఉన్నాం. కానీ రజనీకాంత్ తో పాటు ఆయన అల్లుడు ధనుష్ తీరు మాత్రం  దీనికి భిన్నంగా ఉండటం వల్ల బంగారు బాతు లాంటి తెలుగు మార్కెట్ ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. మొన్న వచ్చిన రజినీకాంత్ కాలా మొత్తం ఆరవ వాసన వేయడంతో మనవాళ్లకు కొంచెం కూడా కనెక్ట్ కాలేక డిజాస్టర్ గా మిగిలింది.

ఇప్పుడు ధనుష్ కూడా అదే దారిలో ఉన్నాడు. వడ చెన్నయ్ పేరుతో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. స్పందన బాగానే ఉంది కానీ ఇది కూడా కాలా తరహాలో చెన్నై బ్యాక్ డ్రాప్ లో తీయడంతో మనవాళ్లకు నచ్చడం డౌటే. దానికి తోడు ఎంత నాసిరకం సంగీతం ఇచ్చినా పదే పదే సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్ నే  పెట్టుకోవడం అందుకో అర్థం కాక ఫాన్స్ సైతం తలలు పట్టుకుంటున్నారు. కాలాకు ఇచ్చిన ట్యూన్స్ వీరాభిమానులు సైతం గుర్తు పెట్టుకోలేనంత తీసికట్టుగా వచ్చాయి. అంతకు ముందు వచ్చిన కబాలి ఆల్బమ్ కూడా బీజీఎమ్ తప్పిస్తే దానిదీ ఇదే కథ. ఎందుకు పోటీ పడి మరీ సంతోష్ నారాయణ్ ను మామ అల్లుళ్ళు చేరదీస్తున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు ఆదరిస్తారా లేదా అనేది పట్టించుకోకుండా ఇలా నేటివిటీ మూసలో పడిపోవడంతో పాటు సంగీత దర్శకుడి విషయంలో మామ అల్లుళ్ళు హోల్ సేల్ గా చేస్తున్న తప్పులు భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి.
Tags:    

Similar News