అందనంత ఎత్తులో అందాల భామల పారితోషికాలు!

Update: 2022-02-19 01:30 GMT
వెండితెరపై వెలిగిపోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడు కొంత అభినయం ఉండాలి .. కొంత అదృష్టం ఉండాలి. అప్పుడే ఆ అందం రాణిస్తుంది .. వినోదాల ప్రపంచంలో పారితోషికాన్ని పెంచుకుంటూ వికసిస్తుంది. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కథానాయికల కెరియర్ కి సంబంధించిన కాలపరిమితి చాలా తక్కువ. గ్లామర్ తో ముడిపడి ఉంటుంది కనుక, ఆ వన్నె తగ్గనంత వరకూ మాత్రం అవకాశాలు వస్తాయి. ఇక ఈ లోగా ఇతరులకు భిన్నంగా ఏదైనా ప్రత్యేకతను కనబరిస్తే మరి కొంతకాలం నిలబడతారు.

ఇక హీరోయిన్లను నిలబెట్టేది కూడా వాళ్ల సక్సెస్ రేటేననడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి సినిమాల్లో చాలావరకూ వాళ్ల పాత్ర పరిధి తక్కువగా ఉంటుంది. పాటలు .. రొమాన్స్ కి సంబంధించిన పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అయినా సినిమా ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ హీరోకంటే ముందుగా హీరోయిన్ పై పడుతుంటుంది. ఇలా అందం చుట్టూ అనేక అవాంతరాలు ఉంటాయి.

అందువల్లనే వాళ్లు తమ క్రేజ్ కి తగిన పారితోషికాలను వసూలు చేస్తూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెడుతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోను ఉంటుంది.

బాలీవుడ్ భామల విషయానికొస్తే దీపిక పదుకొనే - కంగనా ఒక్కో సినిమాకి 15 కోట్ల వరకూ తీసుకుంటున్నారట. అదే ఫీమేల్ సెంట్రిక్ సబ్ జెక్ట్ అయితే మాత్రం 20 కోట్ల వరకూ వెళుతున్నారని అంటున్నారు. ఇక అలియా భట్ కూడా ఒక్కో సినిమాకి 15 కోట్లు అందుకుంటోందని చెబుతున్నారు. అయితే ఇటీవల ఆమె పారితోషికాన్ని తగ్గించి లాభాల్లో వాటా అనే పద్ధతిలో మాట్లాడుకోవడం మొదలెట్టిందని అంటున్నారు. 'గంగూబాయి' విషయంలోనూ ఆమె ఇదే పద్ధతిని ఫాలో అయిందని చెప్పుకుంటున్నారు.

గతంలో కత్రినా కైఫ్ ఎంత తీసుకుందనే విషయాన్ని అలా ఉంచితే ఈ మధ్య కాలంలో ఆమె ఊపు కాస్త తగ్గింది. ఒక్కో సినిమాకి ఆమె 12 కోట్లను వసూలు చేస్తోందట. తన తాజా చిత్రానికి ఆమె ఈ మొత్తమే అందుకుందని అంటున్నారు. ప్రియాంక చోప్రా విషయానికి వస్తే ఆమె 10 కోట్ల దగ్గర నిలకడగా తన పారితోషికాన్ని ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రద్ధా కపూర్ 7 కోట్లు .. తాప్సీ 5 కోట్లు తీసుకుంటూ ఉంటే, విద్యా బాలన్ .. కృతి సనన్ 4 కోట్లను అందుకుంటున్నారట.

దిశాపటానీ .. జాన్వీకపూర్ .. సారా అలీఖాన్ అంతా కూడా  ఒక్కో సినిమాకి రెండున్నర కోట్లను వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఒక సక్సెస్ పడితే వీళ్ల పారితోషికం పరిగెత్తడానికి ఎక్కువ సమయం పట్టదనే సంగతి తెలిసిందే.
Tags:    

Similar News