ఆర్జీవీ 'ఇది మహాభారతం కాదు'..!

Update: 2022-02-17 11:30 GMT
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటనల ఆధారంగా.. నిజ జీవిత పాత్రల స్పూర్తితో సినిమాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుడనే సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి శృంగార తారలు - గ్యాంగ్ స్టర్ వరకు ఎందరో బయోపిక్స్ రూపొందించారు ఆర్జీవీ. అలానే కొందరిని టార్గెట్ చేస్తూ సెటైరికల్ మూవీస్ కూడా తీస్తుంటారు.

'రక్త చరిత్ర' 'వంగవీటి' 'లక్ష్మీస్ ఎన్టీఆర్' 'మర్డర్‌' 'ఆశ ఎన్కౌంటర్' 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' 'పవర్ స్టార్'.. ఇలాంటి సినిమాలు ఇలా వచ్చినవే. 'ఆర్జీవీ మిస్సింగ్' అంటూ తనపైనే ఫిక్షనల్ రియాలిటీ సినిమా తీసుకున్న ఘనుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం తెలంగాణ రాజ‌కీయ నేపథ్యంలో కొండా ముర‌ళి - సురేఖ‌ల జీవిత కథ ఆధారంగా 'కొండా' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలో ఆర్జీవీ ''ఇది మహాభారతం కాదు'' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను రూపొందించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. టైటిల్ లో ఇది మహాభారతం కాదని వర్మ పేర్కొంటునప్పటికీ.. ఇతిహాసం మహాభారతం మీద వ్యగ్యాస్త్రంగా ఉండబోతుందని టాక్. అందులోని పాత్రలను ప్రతిబింభించేలా సినిమాలో క్యారెక్టర్ల పేర్లు ఉంటాయని తెలుస్తోంది.

పాండురాజు - కుంతీదేవి - దుర్యోధనుడు - ధర్మరాజు - భీముడు - అర్జునుడు - కృష్ణుడు - కర్ణుడు - ద్రౌపది - దుశ్శాశనుడు - శకుని పేర్ల మాదిరిగానే పాండన్న - కుంతమ్మ - దురన్న - ధర్మన్న - భీమన్న - అర్జన్న - గోపాలన్న (గోపాల్ యాదవ్) - కర్ణన్న - ద్రౌపద - దుస్సన్న - శక్కన్న అని ''ఇది మహాభారతం కాదు'' సినిమాలో పాత్రలకు పేర్లు పెట్టబోతున్నారట.

అప్సర క్రియేషన్స్ ఓనర్ అయిన గోసంగి శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్ గా మారి 'ఇది మహాభారతం కాదు' చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. ఇందులో టాలెంటెడ్ యాక్టర్ శత్రు కీలక పాత్రలో కనిపించనున్నారు. 'రంగస్థలం' 'భరత్ అనే నేను' 'అరవింద సమేత' 'కల్కి' 'లక్ష్య' 'పుష్ప: ది రైజ్'.. ఇలా తెలుగులో ఎన్నో చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు.

ఇప్పుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించే ''ఇది మహాభారతం కాదు'' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు శత్రు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చి ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

రాంగోపాల్ వర్మ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు గతంలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈసారి 'ఇది మహాభారతం కాదు' అని చెప్తూనే ఇతిహాసం మీద సెటైరికల్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. సాధారణంగా ఆర్జీవీ తన సినిమాల విషయంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా వెనక్కి తగ్గడు. మరి ఈ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News