ఆర్జీవీ వ‌ర్సెస్ పేర్ని నాని! ఎవ‌రు ఎవ‌రిని క‌న్ఫ్యూజ్ చేస్తారు!?

Update: 2022-01-10 04:40 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టికెట్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నిపించ‌డం లేదు. ప్ర‌తిసారీ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భుత్వానిదే పై చేయి అవుతోంది. రామేశ్వ‌రం వెళ్లినా శ‌నీశ్వ‌రం వ‌ద‌ల‌న‌ట్టు.. కోర్టుల‌కు వెళ్లినా కానీ టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే అవ‌కాశం క‌నిపించ‌లేదు. తీర్పులు అనుకూలంగా ఉన్నా అధికారులు మంత్రులు అనుకూలంగా లేరు. ఏది ఏమైనా టికెట్ ధ‌ర‌ను పెంచేదే లే! అన్న‌ట్టుగా ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి అభ్య‌ర్థించారు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అదిలించారు. అగ్ర నిర్మాత‌లంతా విభేధించారు. నాని - సిద్ధార్థ్ లాంటి హీరోలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. ఎవ‌రికి వారు టికెట్ ధ‌ర‌ల్ని పెంచాల‌ని కోరినా కానీ స్పందన స‌రిగా లేదు. ప‌రిశ్ర‌మ‌ను పూర్తిగా రాజ‌కీయ రొంపిలోకి దించారే కానీ ప‌రిష్కారం క‌నుగొన‌లేదు.

అయితే అన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ బిగ్ డిబేట్ కి రెడీ అవుతుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.  గ‌త కొంత‌కాలంగా నానీతో నువ్వా నేనా? అంటూ మీడియాలో డిబేట్ పెట్టిన ఆర్జీవీ .. హీరోల పారితోషాకిన్ని స‌మ‌ర్థించారు. టికెట్ ధ‌ర‌ల్ని పెంచాల్సిన అవ‌స‌రాన్ని మార్కెట్ - స‌ప్ల‌య్ ప‌ద్ధ‌తిలో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. పెరిగిన ధ‌ర‌లను ప‌రిస్థితుల‌ను ఆర్జీవీ విశ్లేషిస్తున్నారు. స‌డెన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆర్జీవీ మాట‌ల ప్ర‌భావం అంతో ఇంతో క‌నిపిస్తోంది. సినిమా టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డిద‌ని ఆయ‌న‌ ప్రశ్నించ‌డం క‌నెక్ట‌య్యింది. నాగాబాబు వంటి వారే ఆర్జీవీకి మ‌ద్ధ‌తుగా నిలిచారు ఈ వ్య‌వహారంలో. మంత్రితో డైరెక్ట్ గా స‌చివాల‌యంలోనే సమావేశం కావాలని కోరుకుంటున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేయ‌గా.. దానికి మంత్రి వెంటనే ఓకే చెప్పేసారు. నేటి మధ్నాహ్నం ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ సమావేశం కానున్నారు.

11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని నేరుగా స‌చివాల‌యానికి ఆర్జీవీ చేరుకుంటారు. అక్క‌డ నువ్వా నేనా? అంటూ డిబేట్ సాగ‌నుంది. ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలపై ఆర్జీవీ నిల‌దీస్తార‌నే అంతా భావిస్తున్నారు. ఆర్జీవీ త‌న‌దైన లాజిక్ సైంటిఫిక్ ఎప్రోచ్ తో మంత్రి నానీని మ‌ట్టి క‌రిపిస్తారనే అంతా భావిస్తున్నారు. ఆయ‌న ఏం చేసినా ఇండ‌స్ట్రీకి మేలు జ‌రిగేలా చేయాల‌ని కోరుకుంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో మంత్రిని ఆర్జీవీ క‌న్ఫ్యూజ్ చేస్తారా లేక ఆర్జీవీనే మంత్రి వ‌ర్యులు డైల‌మాలోకి నెట్టేస్తారా?  ఎవ‌రు ఎంత‌టి మేధావి అన్న‌ది వేచి చూడాల్సి ఉంటుంది. ఆర్జీవీ త‌న‌దైన మేధోత‌నంతో మేధావుల్ని సైతం మెప్పిస్తారనే భావిస్తున్నారు. ఆయ‌న లాజిక్ లు వ‌ర్క‌వుటై టికెట్ రేట్లు పెర‌గాల‌నే అంతిమంగా అంద‌రూ కోరుకుంటున్నారు. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.
Tags:    

Similar News