'జస్టిస్ ఫర్ సుశాంత్ ఒక బోగస్ ప్రచారం.. వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి'

Update: 2020-10-06 16:30 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ ఎయిమ్స్‌ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే మరణించాడని.. గొంతు నులిమి చంపలేదని.. అతనిపై విష ప్రయోగం జరగలేదని ఏడుగురు సభ్యుల ఎయిమ్స్‌ బృందం ఇచ్చిన రిపోర్ట్ స్పష్టం చేసింది. అయినప్పటికే ఈ కేసులో అనుమానాలకు తెర పడలేదు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి లాయర్‌ సతీష్ మనేషిండే.. ఈ కేసులో సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. 'జస్టిస్ ఫర్ సుశాంత్' అనే క్యాంపెయిన్ ఓ బోగస్‌ ప్రచారం అని కొట్టిపారేశాడు.

సతీష్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ''సీబీఐ విచారణలో చివరకు ఏమి తేలుతుందో తెలియాలంటే ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చేంత వరకు వేచి చూడాలి. అంతేకానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు మరియు ఎయిమ్స్‌ వైద్యులపై కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు కోరుకున్నట్లు నివేదిక రాకపోవడంతో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది ఒక బోగస్‌ ప్రచారం. ఎవరైతే ఆ క్యాంపెయిన్ చేస్తున్నారో వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి. ఎందుకంటే సుశాంత్ కి డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు పడింది. అయినప్పటికీ అతడి కుటుంబం వల్ల సోకాల్డ్‌ మీడియా సృష్టించిన అసత్య కథనాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి'' అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర మినిస్టర్ జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఎయిమ్స్‌ రిపోర్ట్ తో ముంబై పోలీసులు ఈ కేసును సరిగానే విచారించారనే విషయం స్పష్టమైంది అని అన్నారు.

కాగా, జూన్‌ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న తరుణంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న రియా తరఫున సతీశ్‌ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా డ్రగ్స్‌ కేసులో రియా కస్టడీని ప్రత్యేక ఎన్డిపిఎస్ న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈ కేసులో అరెస్ట్ కాబడిన వారందరిని రిమాండ్‌ ను అక్టోబర్‌ 20వ తేదీ వరకు పొడగిస్తూ స్పెషల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News