ట్రెండీ టాక్‌: గుర్రాలు బాక్సాఫీస్ స‌వారీకి రెడీ

Update: 2022-02-23 02:30 GMT
గడిచిన రెండేళ్ల‌లో క‌రోనా మ‌హ‌మ్మారీ ఎన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ విధివిధానాల్లో మార్పులకు కార‌ణ‌మైంది. ఇప్పుడు ఓటీటీ రాజ్య‌మేలుతోంది. అయినా థియేట్రిక‌ల్ రంగానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. జ‌నం థియేట‌ర్ల‌కు బారులు తీరుతున్నార‌ని ఇప్ప‌టికే ప్రూవ్ అయ్యింది. ఇదే ఉత్సాహంతో సంక్రాంతి బ‌రిలో రావాల్సిన రాధేశ్యామ్.. ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు ఇప్పుడు మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఈ రెండు భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రాలు కేవ‌లం రెండు వారాల గ్యాప్ తో విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఎవ‌రికి వారు తాము క‌న్ఫామ్ గా గెలుపు గుర్రం అన్న లెక్క‌ల్లో ఉన్నారు. ఇక రాధేశ్యామ్ మార్చి 11న విడుద‌ల‌వుతుండ‌గా.. మార్చి 25న ఆర్.ఆర్.ఆర్ విడుద‌ల‌వుతోంది. ఈ  రెండు సినిమాల‌కు ఇప్ప‌టికే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. వ‌రుస ఫోటోలు వీడియోలు పాట‌లు షేర్ చేస్తూ ప్ర‌చారం లో హైప్ పెంచారు.

అంతేకాదు.. ఓవ‌ర్సీస్ లో టికెట్ల సేల్ కూడా తిరిగి ప్రారంభ‌మ‌వుతోంది. ముందు ఒప్పందాలు చేసుకున్న సెంటర్లలో తిరిగి టికెట్ల అమ్మకాలు మొదలవుతున్నాయి.

ఇక ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ టికెట్లు కొనుక్కుని తిరిగి నిరాశ‌ప‌డిన అభిమానుల‌కు టికెట్లు దొరికే వెసులుబాటును ఆర్.ఆర్.ఆర్ టీమ్ క‌ల్పిస్తోంది. రిలీజ్ నెల రోజుల ముందే అమెరికా ఓవ‌ర్సీస్ లో టికెట్ల అమ్మకం ప్రారంభ‌మైంది. రాధేశ్యామ్ కి కూడా టికెట్ల సేల్ స్టార్ట‌య్యింది.

క్రైసిస్ ఉన్నా అమెరికాలోనూ హాలీవుడ్ సినిమాలు బాగా ఆడాయి. స్పైడర్ మ్యాన్- అన్ చార్టర్డ్ లాంటి చిత్రాలు విజ‌యాలు సాధించాయి. ఇదే హుషారులో తెలుగు సినిమాలు ఓవ‌ర్సీస్ లో చ‌క్క‌ని క‌లెక్ష‌న్లు సాధించ‌డం ఇప్పుడు న‌మ్మ‌కం మ‌రింత పెంచింది.

అందుకే ఇక వాయిదాల ఫ‌ర్వాన్ని కొన‌సాగించ‌కుండా ఆర్.ఆర్.ఆర్ .. రాధేశ్యామ్ టీమ్ లు అలెర్ట‌యిపోయాయి. గుర్రాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నాయి. ఎవ‌రి స‌వారీ ఎంతో కాల‌మే స‌మాధాన‌మిస్తుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాలి. ఇక ఇరు చిత్రాల‌కు అభిమానుల్లో బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి.

ఓవైపు ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో పోటీప‌డుతూ చ‌ర‌ణ్ - తార‌క్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో హ‌వా సాగించాల‌ని క‌సిగా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ ఆ ఇద్ద‌రికీ ఆ ఊపు తెస్తుందనే అంతా భావిస్తున్నారు.
Tags:    

Similar News