విదేశీ భాషల్లో 'RRR'.. డిజిటల్-శాటిలైట్ హక్కులపై పెన్ స్టూడియోస్ ప్రకటన..!

Update: 2021-05-26 13:44 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్‌.ఆర్‌.ఆర్‌'' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఇప్పటికే నిర్మాత డీవీవీ దానయ్య - రాజమౌలి భారీ లాభాలను వెనకేసుకున్నారని టాక్. జయంతిలాల్ గడ ఆధ్వర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ భారీ ధర చెల్లించి 'RRR' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు తీసుకున్నారు. ఇక యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ సరిగమ సినిమాస్ మరియు రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు దక్కించుకున్నాయి.

అయితే గత రెండు రోజులుగా జీ గ్రూప్ సంస్థ రూ.235 కోట్లకు RRR రైట్స్ అన్నింటినీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెన్ స్టూడియోస్ వారు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ థియేట్రికల్ మరియ డిజిటల్ రైట్స్ వివరాలు వెల్లడించారు. ఇది దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా పేర్కొన్నారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్ - కొరియన్ - పోర్చుగీస్ - టర్కిష్ మరియు స్పానిష్ వంటి ఐదు అంతర్జాతీయ భాషలలో డిజిటల్ రిలీజ్ చేయనున్నట్టు పెన్ స్టూడియోస్ ప్రకటించింది. హిందీతో పాటుగా ఈ విదేశీ భాషల స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

హిందీ మినహా మిగిలిన దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రైట్స్ జీ గ్రూప్ సంస్థ(జీ5) సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే హిందీ శాటిలైట్ హక్కులు జీ గ్రూప్(జీ సినిమా) దక్కించుకోగా.. తెలుగు, తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ 'స్టార్' గ్రూప్ వాళ్ళు దక్కించుకున్నారు. జీ గ్రూప్ ఇచ్చిన కొటేషన్ కంటే 5 కోట్లు అదనంగా చెల్లించి 'స్టార్ మా' వారు తెలుగు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మలయాళ శాటిలైట్ హక్కులు ఏషియానెట్ వారు తీసుకున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ నుంచి ఇప్పటికే ఈ హక్కులన్నింటినీ దక్కించుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ.. ఇప్పుడు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ని స్ట్రీమింగ్ సంస్థలకు ఛానల్స్ కి లాభాలకు అమ్ముకున్నారు. ఈ డీల్స్ తో పెన్ సంస్థకు భారీగా ప్రాఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ థియేట్రికల్ రైట్స్ మాత్రం పెన్ స్టుడియోస్ వారి వద్దే ఉన్నాయి. కాగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రూపొందుతోన్న RRR చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Tags:    

Similar News