బాక్సాఫీస్..దసరా రేసులో క్రేజీ ఫైట్

ఫెస్టివల్ సీజన్‌లో సినిమాలు విడుదల చేస్తే, రెగ్యులర్ వీకెండ్స్ కంటే కాస్త ఎక్కువగా పబ్లిక్ అటెన్షన్ దక్కుతుందని మేకర్స్ భావిస్తారు.

Update: 2024-09-29 04:09 GMT

ఫెస్టివల్ సీజన్‌లో సినిమాలు విడుదల చేస్తే, రెగ్యులర్ వీకెండ్స్ కంటే కాస్త ఎక్కువగా పబ్లిక్ అటెన్షన్ దక్కుతుందని మేకర్స్ భావిస్తారు. అందుకే చాలా వరకు స్టార్ హీరోల చిత్రాలను ఫెస్టివల్ వీకెండ్లకు అనుగుణంగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. తదుపరి పెద్ద పండగగా ఉన్న దసరా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా జరుపుకుంటారు.

ఇక ఈ సందర్భంగా అరడజను సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యాయి. ముందుగా దసరా కానుకగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదల అవుతోంది. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి హైప్ ఉంది, ముఖ్యంగా రజనీకాంత్‌ హీరోగా ‘జైలర్’ తర్వాత వస్తున్న సినిమా కావడం వలన ఈ ఆసక్తి మరింత పెరిగింది.

ఇది కాకుండా, స్ట్రైట్ తెలుగులో నాలుగు సినిమాలు దసరా కానుకగా విడుదల కాబోతున్నాయి. అలియా భట్ నటించిన హిందీ మూవీ ‘జిగ్రా’ కూడా తెలుగులో డబ్ చేయబడి అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వం’ మూవీ కూడా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరూ ఇటీవల విజయాలు సాధించకపోవడంతో, మూవీపై పెద్దగా బజ్ లేదు. ప్రమోషన్లకు తక్కువ సమయం దక్కింది. టీజర్ కూడా పెద్దగా ఆసక్తి రేకెత్తించకపోవడంతో, ‘విశ్వం’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. దిల్ రాజు బ్యానర్‌లో సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘జనక అయితే గనక’ కూడా అక్టోబర్ 11న విడుదల అవుతోంది. ఈ చిత్ర కథాంశం ఇప్పటికే ప్రేక్షకులకి దగ్గరైంది, కచ్చితంగా ఈ మూవీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్ ఆధారంగా సుధీర్ బాబు చేసిన ‘మా నాన్న సూపర్ హీరో’ కూడా ఈ దసరా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుధీర్ బాబు ఈ సినిమాను బలంగా ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 11న విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఈ దసరాకి 6 సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. మరి వీటిలో ఏది విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News