RRR : ఒక్క వారంలో అంతా మారిపోయింది

Update: 2022-01-07 04:39 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో అందరికి తెల్సిందే. ఇద్దరు పెద్ద హీరోలు అయిన రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించడం మాత్రమే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ మరియు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అజయ్ దేవగన్ ఇంకా కీలక పాత్రలో శ్రియ ప్రముఖ నటీ నటులు నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతటి అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను అన్ని అనుకూలిస్తే కరోనా కరుణించి ఉంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కరోనా కారణంగా నేడు విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల వాయిదా పడింది. వారం రోజుల ముందు వరకు దేశ వ్యాప్తంగా ఆర్‌ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ స్థాయిలో జరిగాయో అందరికి తెల్సిందే.

ముంబయి ఈవెంట్‌ లో సల్మాన్‌ ఖాన్ స్పెషల్‌ గెస్ట్‌ గా హాజరు అవ్వడం మొదలుకుని కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్‌ ఆర్‌ ఆర్ చిత్ర యూనిట్‌ సభ్యుల ప్రత్యేక ఇంటర్వ్యూలు మరియు ప్రెస్ మీట్‌ లు ప్రీ రిలీజ్ వేడుకలు ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఆర్ ఆర్ ఆర్‌ కు అనూహ్యంగా స్పందన దక్కింది. ఓవర్సీస్ లో అయితే ముందు రోజే ప్రీమియర్‌ చూసేందుకు గాను వేలాది మంది అడ్వాన్స్ బుకింగ్‌ ను కూడా చేసుకుని పెట్టుకున్నారు. కేవలం ప్రీమియర్ ల ద్వారా మూడు నాలుగు మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు అవుతాయని విశ్లేషకులు భావించారు. అంతా బాగుంది.. ఓ రేంజ్ లో సినిమా వసూళ్లు సాధించబోతుంది అనుకుంటూ బయ్యర్లు.. నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరు వారం ముందు వరకు ఊహల్లో ఉన్నారు. ప్రేక్షకులు సినిమా ను ఏ రోజు చూడాలి.. ఎవరి తో చూడాలి.. ఎక్కడ చూడాలి అనే విషయాలపై చర్చించుకుంటున్నారు.

కొందరు కాలేజ్‌ స్టూడెంట్స్ ఆ రోజు కాలేజ్ కు బంక్ కొట్టాలని నిర్ణయించుకుంటే ఆఫీస్ లకు వెళ్లే వాళ్లు ముందస్తు సెలవులు పెట్టుకోవడం లేదంటే ఊర్లో ఉన్న వారు ఎర్లీ మార్నింగ్‌ షో ల కోసం సిటీకి వెళ్లాలని అనుకోవడం ఇలా ప్రేక్షకులు ఎన్నో రకాలుగా ప్లాన్‌ చేసుకున్నారు. వారం ముందు వరకు కూడా సినిమా విడుదల ఉంటుందనే అంతా నమ్మారు. అందుకే ప్లానింగ్‌ పక్కాగా చేసుకున్నారు. కాని కరోనా థర్డ్‌ వేవ్ భారీ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను అడ్డుకుంది.

భారీ భారీ సినిమాలే ఆర్ ఆర్‌ ఆర్ సినిమా విడుదల కారణంగా వాయిదా పడ్డాయి. కాని కరోనా వల్ల ఆర్ ఆర్‌ ఆర్ సినిమా విడుదల ఆగిపోయింది. ఒక వేళ నేడు సినిమా విడుదల అయ్యి ఉంటే మరో రేంజ్ లో వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశ వ్యాప్తంగా కనిపించేది. తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద వారం రోజుల ముందే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించేది. కాని వారం రోజుల్లోనే అంతా మారిపోయింది. మళ్లీ ఆ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థర్డ్‌ వేవ్ ప్రభావం కనీసం మూడు నెలలు అయినా ఉంటుందని అంటున్నారు. కనుక సినిమా విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.
Tags:    

Similar News