బర్త్ డే నాడు రాజమౌళి పై 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ కంప్లైంట్...!

Update: 2020-10-10 12:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. బుల్లి తెర నుండి వెండి తెర వైపుకు అడుగులు వేసిన రాజమౌళి.. అపజయం అంటే ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్నాడు. 'బాహుబలి' సినిమాతో యావత్ చిత్ర పరిశ్రమ టాలీవుడ్ వైపు చూసేలా రాజమౌళి.. చాలా గ్యాప్ తీసుకొని 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు దర్శకధీరుడు 48వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ విభిన్నంగా డైరెక్టర్ రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

'ఆర్.ఆర్.ఆర్' టీమ్ రాజమౌళి మీద కంప్లైంట్ చేస్తున్నట్లు ఓ వీడియో షూట్ చేసి రిలీజ్ చేశారు. 'ఈ రోజు మన డైరెక్టర్ బర్త్ డే కి విషెస్ చెప్పమని టీమ్ మెంబెర్స్ ని అడిగితే.. ఇది వచ్చింది..' అంటూ వీడియోలో చిత్ర యూనిట్ రాజమౌళిపై ఫిర్యాదు చేస్తున్నట్లు బైట్స్ ఇచ్చారు. కో డైరెక్టర్ త్రికోటి మాట్లాడుతూ ''విక్రమార్కుడు' సినిమా నుంచి చూస్తున్నా డైరెక్టర్ స్టోరీ సిట్టింగ్స్ ఆఫీస్ లోనో ఇంట్లోనో పెడుతూ ఉంటాడు. అందరూ స్టోరీ డిస్కషన్స్ కి బ్యాంకాక్ మలేషియా వెళ్తున్నారు.. మనం కూడా వెళదాం అని నేను ఒకసారి డైరెక్టర్ ని అడిగాను. తీరా చూస్తే ఇంటి మేడపైకి తీసుకెళ్లి ఇక్కడే స్టోరీ సిట్టింగ్స్ కి బాగుంటది అన్నాడు. ఈసారైనా మీరు బ్యాంకాక్ మలేషియాలలో సిట్టింగ్ పెట్టాలని కోరుకుంటున్నా' అని చెప్పాడు. కీరవాణి మాట్లాడుతూ ''జనవరిలో పల్లవి చేస్తాం. జూన్ లో చరణం చేస్తాం. డిసెంబర్ లో లిరిక్ రాయిస్తాడు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో దాని రికార్డింగ్ అంటాడు. ఆ తర్వాత వచ్చే నవంబర్ లో వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఈలోపు పల్లవి ఏంటి.. మనం అసలు ఏ సినిమా కోసం పనిచేస్తున్నాం. దాని పర్పస్ ఏంటి అనేది మర్చిపోతాం. ఇంట్రెస్ట్ పోతుంది'' అని కంప్లైంట్ చేసాడు.

హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ ''కంప్లికేటెడ్ షాట్స్ ఎప్పుడూ మనం రిలాక్స్ అవుదాం అనుకునే టైములో పెడుతుంటాడు. 12.30కి ఒక షాట్ పెడితే ఒంటి గంటకు కూడా అది ఒకే అవదు. జక్కన్నలా షాట్ ని చెక్కుతూ చెక్కుతూ 2.30 అవుతుంది. నా దరిద్రమో లేదా అలా కుదురుతుందో తెలియదు కానీ. కరెక్ట్ గా అర్థరాత్రి 2 గంటలకు ప్యాక్ అప్ అవుతుంది అనుకుంటుండగా ఈ రాక్షసుడు ఒకటిన్నరకు షాట్ పెడతాడు. రెండున్నర మూడున్నర నాలుగున్నర.. ఒక్క షాట్ మూడు గంటలు.. ఆయన పర్ఫెక్షన్ తో మమ్మల్ని చావగొడుతుంటాడు'' అని చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ మాట్లాడుతూ 'రాజమౌళి యాక్షన్ సీన్స్ తీస్తున్నాడని ఎక్సర్సైజ్ జిమ్ చేసి వెళ్ళాను. 40 ఫీట్ నుంచి జంప్ చేసే సీన్ చెప్పాడు. బాగుంది సర్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే నువ్వే చేస్తున్నావ్ చరణ్ అన్నాడు. లాప్ టాప్ తెప్పించి రెండు రోజుల ముందే అన్ని యాంగిల్స్ షూట్ చేసింది చూపిస్తాడు. ఆయన చేసిన తర్వాత మనం చేయకపోతే ఎలా అని.. నో చెప్పలేక ముందుకు వెళ్ళిపోతాం' అని చెప్పాడు. చివరగా ఈ రీజన్స్ కే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం.. బెస్ట్ రాబట్టడం కోసం ప్రతిరోజూ మమ్మల్ని పుష్ చేసినందుకు థ్యాంక్స్' అంటూ 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ దర్శకధీరుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపింది.


Full View
Tags:    

Similar News