మెగా మేనల్లుడా.. ఇక వదిలేయమ్మా

Update: 2016-05-08 13:30 GMT
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. బాగుంది కదా అని ఏది ఎక్కువ తీసుకున్నా తేడా కొట్టేస్తుంది. మొహం మొత్తేస్తుంది. ఆ సంగతి మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదేమో. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకులు చిరంజీవి..పవన్ కళ్యాణ్ రెఫరెన్సుల్ని తమ సినిమాల్లో వాడుకోవడం తప్పేమీ కాదు. ఇప్పటికే కొందరు హీరోలు అది చేశారు. అభిమానులు కూడా వాటిని ఆస్వాదించారు. ఐతే ఈ వాడకం ఒకటీ అరా సందర్భాల్లో మినహాయిస్తే కనిపించదు. చాలా వరకు మెగా హీరోలు ఎవరికి వారు తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లే. కేవలం చిరంజీవినో.. పవన్ కళ్యాణ్‌ నో అనుకరిస్తూ.. వాళ్ల పాటల్ని రీమిక్స్ చేస్తూ.. వాళ్ల రెఫరెన్సులు చూపిస్తూ నెట్టుకొచ్చేయట్లేదు. కానీ సాయిధరమ్ మాత్రం ఆ దారిలోనే ప్రయాణం చేస్తున్నాడు.

తొలి సినిమా ‘రేయ్’లో.. గత ఏడాది వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో తన మావయ్యలిద్దరినీ బాగా వాడేసుకున్నాడు సాయిధరమ్. సుబ్రమణ్యం.. సినిమా వరకు ఈ వేషాలు జనాలకు ఓకే అనిపించాయి. మెగా అభిమానులకు నచ్చాయి. ఐతే ‘సుప్రీమ్’ దగ్గరికి వచ్చేసరికి మామూలు జనాలకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఐతే ఈ సినిమా వరకు సర్దుకుపోయారు. కానీ ఇక మున్ముందు రాబోయే సినిమాల్లోనూ సాయిధరమ్ ఇదే దారిలో వెళ్తే జనాకలు మొహం మొత్తడం ఖాయం. ఇక చిరంజీవి.. పవన్ కళ్యాణ్ ల అనుకురణ మానేసి.. రీమిక్స్ పాటలకు బ్రేక్ ఇచ్చేసి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మీద దృష్టిపెడితే బెటర్. నిజానికి ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో ఇలాంటి అనుకరణలేమీ చేయలేదు. అందులో రీమిక్సులూ లేవు. అయినా సినిమా బాగానే ఆడింది. సాయిధరమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. మరి ఆ టాలెంటుతో సాయిధరమ్ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News