మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

Update: 2017-07-18 10:19 GMT
ఈగ.. అందాల రాక్షసి.. ఊహలు గుసగుసలాడే.. దిక్కులు చూడకు రామయ్యా.. ఈ చిత్రాల వరుస చూస్తేనే నిర్మాత సాయి కొర్రపాటికి ఎంత మంచి అభిరుచి ఉందో అర్థమవుతుంది. ఆయన కేవలం వ్యాపార కోణంతో సినిమాలు తీయరు. కొత్తదనానికి పెద్ద పీట వేస్తారు. మంచి సినిమాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో కొన్ని మంచి విజయాలను అందుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ ఈ మధ్య ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన బేనర్ నుంచి వస్తున్న సినిమాలు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఆయనకు చేదు అనుభవాల్ని మిగులుస్తున్నాయి.

గత ఏడాది విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ‘మనమంతా’ అనే మంచి సినిమా తీశాడు సాయి. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందరూ మంచి సినిమా అన్నారు. కానీ అది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. సాయికి డబ్బులు తెచ్చి పెట్టలేదు. దాని కంటే ముందు కొత్త దర్శకుల్ని నమ్మి తీసిన ‘రాజా చెయ్యి వేస్తే’.. ‘తుంగభద్ర’ కూడా చేదు అనుభవాల్నే మిగిల్చాయి సాయికి. ఇటీవలే ఆయన రెండు సినిమాలతో పలకరించారు. వేరే నిర్మాతలు తీసిన ‘రెండు రెళ్ళు ఆరు’ అనే సినిమాను టేకప్ చేసి తన బేనర్ ద్వారా రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. ఇక జగపతిబాబు హీరోగా వాసు పరిమి అనే కొత్త దర్శకుడితో ‘పటేల్ సార్’ అనే సినిమా తీశారు సాయి. దీనికి మంచి హైపే వచ్చింది కానీ.. ఇది కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. గత రెండేళ్లలో సాయికి మంచి ఫలితాన్నిచ్చిన ఏకైక సినిమా ‘జ్యో అచ్యుతానంద’. అది కూడా కమర్షియల్ గా మరీ పెద్ద విజయం ఏమీ సాధించలేదు. వారాహి నుంచి వస్తున్న సినిమాల్లో వైవిధ్యం అయితే కనిపిస్తోంది కానీ.. అవి ప్రేక్షకుల్ని మెప్పించే స్థాయిలో ఉండట్లేదు. వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో ఆయన ఇకపై కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే బెటర్.
Tags:    

Similar News