వివాదాలకు దూరంగా ఉండే ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 'విరాటపర్వం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
మతం కంటే మానవత్వం గొప్పదని చెప్పాలనే ఉద్దేశ్యంతో.. ‘కాశ్మీర్ ఫైల్స్’ మూవీలో కశ్మీర్ పండిట్లను చంపడం - లాక్ డౌన్ టైంలో గోరక్షణ పేరుతో జరిగిన దాడులను ఉదహరిస్తూ సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇది మతపరమైన కాంట్రవర్సీకి దారి తీయడమే కాదు.. ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ కేసులు పెట్టే వరకూ వెళ్ళింది. ఈ అంశంపై కొంత మంది సాయి పల్లవికి మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇదే విషయంపై సాయి పల్లవి తాజాగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది.
ఇంటర్వ్యూలో నాకు 'మీరు లెఫ్ట్ భావజాలం ఉన్న వారికి సపోర్ట్ చేస్తారా? రైట్ వారికా?' అనే ప్రశ్న ఎదరైంది. దీనికి చాలా స్పష్టంగా నేను న్యూట్రల్ అని సమాధానమిచ్చాను. ఒక వర్గానికి చెందిన వారి కంటే ముందు మనం మంచి మనుషులుగా ఉండాలని నేను నమ్ముతాను అని సాయి పల్లవి తెలిపింది.
'కశ్మీర్ ఫైల్స్' చూసిన తర్వాత చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఆనాడు జరిగిన సంఘటన వల్ల ఇప్పటికీ ఎంతో మందిపై ప్రభావం ఉంది. అలాగే కోవిడ్ సమయంలో జరిగిన దాడులు చూసి షాక్ అయ్యాను. ఈ రెండు ఘటనలు నన్ను తీవ్రంగా భాదించాయని చెప్పింది.
తన దృష్టిలో ఏ రూపంలో జరిగినా హింస అనేది ముమ్మాటికీ తప్పేనని.. ఏ మతంలోనైనా హింస అనేది మంచిది కాదని గతంలోనే చెప్పానంది. అన్నిటికంటే మానవత్వం గొప్పదని సాయి పల్లవి పేర్కొంది. ఓ డాక్టర్ గా ప్రాణం విలువ తనకు తెలుసని.. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
ఫుల్ వీడియో చూడకుండా ఇంటర్వ్యూలోని చిన్న క్లిప్ ను తీసుకొని ప్రధాన మీడియా కూడా వార్తలు రాయడం.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని కామెంట్స్ చేయడం బాధించిందని పల్లవి తెలిపింది.
ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని.. ఎందుకంటే తన మాటల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని చెప్పింది. ఒకవేళ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని సాయి పల్లవి ఈ సందర్భంగా కోరింది.
ఈ ఇష్యూలో గత మూడు రోజులుగా తనకు మద్ధతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తున్నానని సాయి పల్లవి వీడియోలో పేర్కొంది. మరి పల్లవి వివరణతో ఈ వివాదం సర్దుమనుగుతుందో.. మరింత ముదురుతుందో చూడాలి.