పెళ్లి కాలేదు కానీ.. భార్యలాగే

Update: 2018-12-29 08:13 GMT
పాతికేళ్ల నుంచి బాలీవుడ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్యాగ్ సల్మాన్ ఖాన్ దగ్గరే ఉంది. పాతికేళ్ల వయసులో ‘మైనే ప్యార్  కియా’ లాంటి సినిమాతో కోట్లాది మంది అమ్మాయిల మనసులు దోచిన సల్మాన్.. ఇప్పటి దాకా పెళ్లి ఊసే ఎత్తలేదు. ఐశ్వర్యారాయ్.. కత్రినా కైఫ్ లాంటి వాళ్లతో పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లిన సల్మాన్.. చివరికి వాళ్లకు దూరం అయ్యాడు. ఐతే కొన్నేళ్లుగా రొమేనియా భామ లులియా వాంటూర్ తో పీకల్లోతు ప్రేమలో సాగుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. లులియా కొన్నేళ్లుగా ఇండియాలోనే.. సల్మాన్ తో పాటే ఉంటోంది. వీళ్ల పెళ్లి గురించి ఇప్పటికే చాలా ఊహాగానాలు వచ్చాయి. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప పెళ్లి మాత్రం జరగట్లేదు. అలాగని సల్మాన్ గత ప్రేమకథల్లా ఇది అర్ధంతరంగా ముగిసేలాగా కూడా కనిపించడం లేదు. సల్మాన్-లులియా పెళ్లి చేసుకోలేదు అంతే కానీ.. భార్యాభర్తల్లాగే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారట. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

తాజాగా డిసెంబరు 27న సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా వీళ్లిద్దరి అనుబంధం చూసిన వాళ్లంతా భార్యాభర్తలకు వీళ్లకు ఏమీ తేడా కనిపించలేదని అంటున్నారు. పుట్టిన రోజుకు సల్మాన్ పెద్ద పార్టీ ఇవ్వగా.. బాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగింది. సల్మాన్ భార్యలాగే లులియా మెలిగిందట. సల్మాన్ తో కలసి ఏర్పాటలన్నీ పరిశీలించడం.. అతిథుల్ని రిసీవ్ చేసుకోవడం.. ఇలా చాలా పనులే చేసిందట లులియా. సల్మాన్ కు పుట్టిన రోజు కానుకగా లులియా కాస్ట్లీ గోల్డ్ చైన్ ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో సల్మాన్ కుటుంబం విహారయాత్రలకు వెళ్తే లులియా వారితో కలిసి కనిపించింది. తాజాగా సల్మాన్ పుట్టిన రోజు వేడుకల్లో లులియా వ్యవహరించిన తీరు చూస్తే అతి త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.

Tags:    

Similar News