గాడ్ ఫాదర్ కోసం పవన్ కళ్యాణ్ ని అందుకే అడగలేదు..!

Update: 2022-10-09 00:30 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లూసిఫర్' మూవీ రీమేక్ గా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. రీమేక్ అయినప్పటికీ చిరు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలానే మార్పులు చేశారు. ఇవి మెగా అభిమానులను బాగానే ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి పెర్ఫామెన్స్.. సత్యదేవ్ - నయనతార అభినయం.. తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు చేసిన మార్పులు చేర్పులు.. ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వంటివి 'గాడ్ ఫాదర్' లో హైలైట్ గా నిలిచిన అంశాలుగా ఆడియన్స్ పేర్కొంటున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారని తెలుస్తోంది.

ఒరిజినల్ లో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ పోషించారు. ముందు నుంచే ఇండియాలోని ఇద్దరు మెగాస్టార్స్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని ప్రచారం చేయడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. కానీ తీరా సినిమా చూస్తే కండల వీరుడు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.

సల్మాన్ ఎంట్రీ ‘గాడ్ ఫాదర్’ ను హిందీలో రిలీజ్ చేసుకోడానికి ఉపయోగపడింది కానీ.. తెలుగులో మాత్రం అతని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరలేదనే కామెంట్స్ వస్తున్నాయి. పైగా సల్మాన్ కనిపించే సన్నివేశాలు చాలా సాదాసీదాగా ఉన్నాయని అంటున్నారు.

మాతృకలో మోహన్ లాల్ కు అవసరమైనప్పుడల్లా పృథ్వీరాజ్ వచ్చి ఆదుకునే సన్నివేశాలు చాలా బాగా పండాయి. కానీ ఇక్కడ సల్మాన్ ఖాన్ ఆ పాత్రను చేయడంతో  ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగలేదు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలానే ఉంది.

అదే సల్మాన్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ చేసి ఉంటే.. పొలిటికల్ సినిమా కాబట్టి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవల్ లో ఉండేదని.. ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అయ్యేవాళ్ళనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెగా అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ సీన్స్ వేరేగా ఉండేవని.. బాక్సాఫీస్ బద్దలైపోయేదని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కాకపోయినా రామ్ చరణ్ - అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలు ఎవరైనా ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేదని.. రీమేక్ సినిమా అయినా రిజల్ట్ ఇంకో స్థాయిలో ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయం మీద దర్శకుడు మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

సల్మాన్ ఖాన్ ను తీసుకోవడం అనేది తన ఛాయిసే అని.. అయితే ఆయన్ని అలంకరణ కోసమే తీసుకున్నామని మోహన్ రాజా తెలిపారు. ''నేను ఒక సినిమాగా చూశాను.. పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచలేదు. ఫ్యామిలీలో హీరో చెప్పడం కంటే.. బయట నుంచి ఒక స్టార్ చెప్పడం బాగుంటుందని నేను అనుకున్నాను. అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను'' అని చెప్పుకొచ్చారు.

ఏ సినిమా అయినా 100 శాతం ఆడియన్స్ ని తృప్తి పరచలేదు.. మెజారిటీ వర్గాన్ని మెప్పిస్తే సక్సెస్ అయినట్లే.. ఇక్కడ మెజారిటీని సాటిస్ఫై చేయడానికి ఏమేమి చేయాలో అన్నీ చేశానని అనుకుంటున్నానని మోహన్ రాజా చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News