భాయ్ టైటిలే కాదు లుక్కు కూడా సూప‌రు!

Update: 2022-08-27 04:10 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఉన్న అసాధార‌ణ క్రేజ్ మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా వ‌సూళ్లు తేగ‌లిగే స‌మ‌ర్థుడిగా అత‌డికి పాపులారిటీ ఉంది. భాయ్ న‌టించిన అతిపెద్ద ఫ్లాప్ అయిన 'దబాంగ్ 3' కూడా అతని బాక్సాఫీస్ స్టామినాను రుజువు చేస్తూ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. నేటికి ఈ నటుడు హిందీ చిత్ర పరిశ్రమలో 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సల్మాన్ తదుపరి చిత్రానికి 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే టైటిల్ ను ప్రకటించారు. సల్మాన్ ఈ సినిమా నుంచి తన లుక్ ను కూడా రివీల్ చేశాడు. అతను పొడవాటి జుట్టుతో కనిపించాడు. స్టైలిష్ గా గాగుల్స్ ధరించాడు. గాలికి అలా పొడ‌వాటి జుత్తు ఎగురుతుంటే భాయిజాన్ అంటూ నేప‌థ్యంలో ట్యూన్ ఆక‌ట్టుకుంది. భాయ్ లుక్ చాలా స్టైలిష్ గా ఆకర్షణీయంగా ఉంది.

తన 34 ఏళ్ల సినీ ప్రయాణంలో తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు సల్మాన్. తన మూడు దశాబ్దాల చలనచిత్ర జీవితంలో భ‌జరంగీ భాయిజాన్ లో పవన్ కుమార్ చతుర్వేది.. సుల్తాన్ లో సుల్తాన్ అలీ ఖాన్ వంటి అనేక చిరస్మరణీయ పాత్రలు చేసాడు. కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ లను అందించాడు. టైగ‌ర్ ఫ్రాంఛైజీతో అత‌డు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు. త్వరలో టైగర్ 3 చిత్రాన్ని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'గాడ్ ఫాదర్‌'లో కీల‌క పాత్ర‌లో కనిపించబోతున్నాడు.

మెగాస్టార్ తో స్నేహం కోసం..

మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్‌ ఖాన్ లు క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌. మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో ఏనాడూ ప్రాంతీయ భాష‌ల వైపు దృష్టి సారించ‌ని స‌ల్మాన్ ఇప్పుడు త‌న స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి కోసం టాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. గాడ్ ఫాద‌ర్ లో చిరుకి స‌హాయ‌కుడిగా క‌నిపించే పాత్ర‌లో స‌ల్మాన్ న‌టిస్తున్నాడు.

ఇటీవలే చిరు- స‌ల్మాన్ కాంబినేష‌న్ లో 'ది బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్' (మాస్‌ సాంగ్‌) షూటింగ్‌ పూర్తయిందని టీమ్ ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను సంగీత సంచలనం థమన్ స్వరపరిచారు. మెగాస్టార్ - సూప‌ర్ స్టార్ క‌ల‌యిక‌లో ఈ పాట సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఆ ఇద్దరూ కలిసి కాలు క‌ద‌ప‌డ‌మే ఒక పెద్ద మ్యాజిక్ అనుకుంటే ఇది ఇద్ద‌రు అగ్ర హీరోల ఫ్యాన్స్ కి అద్భుత ట్రీట్ అవుతుంది.

ఈ చిత్రం లో నయనతార- సత్యదేవ్- సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ- సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త‌దుప‌రి చిరు గాడ్ ఫాద‌ర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించనుండ‌గా.. స‌ల్మాన్ త‌న వ‌రుస ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీ అవుతారు.




Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News