సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ కెమెరా ముందుకు వెళ్లాడు. `బ్రూస్లీ` కోసం. మెగా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో కోలాహలం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఊపులో 150వ సినిమా కూడా మొదలుపెడితే బాగుండేది కదా అని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవి కూడా అదే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఏ క్షణంలోనైనా 150వ సినిమాని ప్రకటించొచ్చు. ఆ విషయం అటుంచితే మెగాస్టార్ `బ్రూస్లీ`లో ఎలా కనిపించబోతున్నాడన్న విషయం ఇప్పుడు అభిమానుల్ని మరింత ఆసక్తికి గురిచేస్తోంది. ముఖ్యంగా చిరు గెటప్ ఎలా ఉంటుంది? చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు కదా ఆయన కెమెరా ముందు ఎలా మెలుగుతున్నాడు? మళ్లీ పాత వాతావరణానికి అలవాటుపడిపోయాడా లేదా? ఇలా అభిమానుల్లో బోలెడన్ని సందేహాలు. అయితే చిత్రబృందం మాత్రం సెట్ లో జరుగుతున్న విషయాలన్నింటినీ సీక్రెట్ గా ఉంచుతోంది. చిరు గెటప్ గురించి అస్సలు బయటికి తెలియనివ్వడం లేదు. ఆ గెటప్ ని బహుశా ఆడియో ఫంక్షన్ లోనే చూపిస్తుండొచ్చు. అయితే సెట్ కి వెళ్లొచ్చినవాళ్లు, యూనిట్ లోని కొంతమంది మాత్రం చిరు లుక్ గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మన బర్నింగ్ స్టార్ సంపూ `బ్రూస్లీ` సెట్ కి వెళ్లి కలిశాడట. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. దాంతోపాటు చిరు గెటప్ గురించి కూడా ఆయన కొన్ని విషయాలు ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. చిరు అచ్చం గ్యాంగ్ లీడర్ లాగా కనిపిస్తున్నాడని స్పష్టం చేశాడు సంపూ. ఆ లుక్ తో తెరపై మూడు నిమిషాలు కనిపించినా అభిమానులకి పండగే అంటున్నాడు. ఆయన మాటలు విన్న అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.