అల.. సరిలేరు లెంగ్త్ తో కష్టమే అంటున్నారే!

Update: 2020-01-08 06:07 GMT
ఈ సంక్రాంతి కి రిలీజ్ కానున్న నాలుగు సినిమాల్లో ప్రధానమైన పోటీ మాత్రం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మధ్యే ఉంది. స్టార్ హీరోలు కావడం.. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో హైప్ కూడా ఆకాశాన్ని తాకుతోంది. అయితే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం కూడా అంత సులువేమీ కాదు. తెలుగు సినిమాల మార్కెట్ ఎంత పెరిగినప్పటికీ ఒక సినిమా కు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావాలంటే మాత్రం ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావల్సిందే. ఓపెనింగ్ కలెక్షన్ కూడా ఈ సినిమాలకు కీలకం కానుంది.

అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో ఈ సినిమాలకు లెంగ్త్ వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా కథను బట్టి.. మేకర్స్ ఛాయిస్ ను బట్టి లెంగ్త్ ఉంటుంది. ఆ నిడివి ఇంతే ఉండాలని రూల్స్ ఏమీ లేవు. అయితే నిడివి తక్కువగా ఉన్న సినిమాలకు ఒక విషయంలో ఎడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే ఒక రోజు లో ఎక్కువ షోస్ ప్రదర్శించే అవకాశం. సింగిల్ స్క్రీన్ థియేటర్ల లో ఇలా చెయ్యాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి లభించినా లెంగ్త్ తక్కువ ఉంటే ఎక్కువ షోలు వేసుకునే అవకాశం దక్కుతుంది అయితే మల్టిప్లెక్స్ స్క్రీన్స్ లో మాత్రం ప్రత్యేక అనుమతుల అవసరం ఉండదు. కానీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు రెండిటికి లెంగ్త్ ఎక్కువే ఉంది. దీంతో ఎక్కువ షోలు వేసుకునే అవకాశం తగ్గిపోయింది.

'సరిలేరు నీకెవ్వరు' నిడివి 169 నిముషాలు కాగా 'అల వైకుంఠపురములో' సినిమా డ్యూరేషన్ 165 నిముషాలు. అంటే రెండు సినిమాలు రెండు గంటల నలభై ఐదు నిముషాల పైనే ఉన్నాయి. ఈ నిడివితో మల్టి ప్లెక్సులలో ఎక్కువ షోల ఎడ్వాంటేజ్ వాడుకోవడం కష్టం. ఇదే లెంగ్త్ కనుక 140-45 నిముషాలు ఉంటే ఈ ఎడ్వాంటేజ్ ఉండేదని అంటున్నారు. అయితే నిజంగా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం ఇలాంటివాటితో ఎటువంటి నష్టం ఉండదు.
Tags:    

Similar News