ఆ సినిమా తెలుగులోనూ హిట్టే...

Update: 2018-11-12 11:24 GMT
దీపావళి కానుకగా తమిళనాట భారీ అంచనాలతో విడుదలైన ‘సర్కార్’ సినిమా అక్కడ వసూళ్ల మోత మోగించింది. టాక్ కొంచెం డివైడ్‌ గా ఉన్నప్పటికీ.. ఆ ప్రభావం ఏమీ సినిమాపై పడలేదు. తొలి రోజు నుంచి రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్లింది. వీకెండ్ అయ్యే వరకు వసూళ్ల ప్రభంజనం కొనసాగింది. ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లతోనే సాగుతోంది. తమిళంలో బయ్యర్ల పెట్టుబడి వారం రోజుల్లో వెనక్కి వచ్చేసేలా కనిపిస్తోంది. ‘సర్కార్’ను అక్కడ బ్లాక్ బస్టర్ అని తీర్మానించేశారు. వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉందా చిత్రం. తెలుగులో సైతం ‘సర్కార్’కు మంచి వసూళ్లు రావడం విశేషం. తమిళంతో పోలిస్తే ఇక్కడ టాక్ మరింత నెగెటివ్ గా వచ్చింది. విజయ్ కి ఇక్కడ పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు కాబట్టి సినిమా నిలబడదని అనుకున్నారు.

కానీ దీపావళి కంటే ముందు వచ్చిన సినిమాల జోరు తగ్గిపోవడం.. పోటీగా వచ్చిన ‘అదుగో’.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం ‘సర్కార్’కు కలిసొచ్చింది. దీపావళి సీజన్లో ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ ఇదే అయింది. దీంతో లాంగ్ వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టిందీ చిత్రం. విజయ్ కెరీర్లోనే అత్యధికంగా రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టింది ‘సర్కార్’. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన వల్లభనేని అశోక్ మంచి లాభాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బయ్యర్ల పెట్టుబడి దాదాపుగా వెనక్కి వచ్చేసింది. ఇక వచ్చేదంతా లాభాలే అని తెలుస్తోంది. కాకపోతే ఈ వారాంతంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ‘ట్యాక్సీవాలా’ లాంటి క్రేజీ సినిమాలు వస్తున్నాయి. కాబట్టి వీకెండ్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆలోపు వచ్చేదంతా లాభమే. తెలుగులో విజయ్ మార్కెట్  ఈ చిత్రంతో బాగా పెరిగిందన్నది స్పష్టం.
Tags:    

Similar News