ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన మరో తెలుగు సినిమా...!

Update: 2020-06-12 15:41 GMT
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్‌ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఇక తిరిగి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే షూటింగులకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రాబోయే రెండు నెలల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్‌ కి వస్తారా అనేదీ అనుమానమే. దీన్ని క్యాష్ చేసుకోవాలని భావించిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఫ్యాన్సీ రేట్స్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇక నిర్మాతలు కూడా ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో 'అమృతరామన్' అనే సినిమా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయిన తెలుగు చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా జీ5 ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. ఇక తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా కూడా ఓటీటీలో విడుదలైంది. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ - ఆయుష్మాన్‌ ఖురానా కలిసి నటించిన చిత్రం 'గులాబో సితాబో' కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు వివిధ భాషల్లోని పలు సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు.

ఇప్పుడు మరో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. అదే సత్యదేవ్‌ - పూజా ఝవేరి ప్రధాన పాత్రలలో రూపొందిన '47 డేస్‌ - ది మిస్టరీ ఆన్‌ ఫోల్డ్స్‌'. పూరి జగన్నాథ్‌ శిష్యుడు ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దబ్బార శశి భూషణ్‌, రఘుు కుంచె, శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ శంకర్‌ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ర‌ఘు కుంచె నిర్మాతగా వ్యవహరిస్తూనే సంగీతం కూడా అందించాడు. ఇక ఈ చిత్రంలో హరితేజ, రోషిని, సత్యప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన '47 డేస్‌' గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. అదే ఏడాది ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయడానికి బయ్యర్లు ఎవ్వరూ ముందుకురాలేదట. ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితులలో థియేటర్లలో రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా ఓటీటీకి ఇచ్చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో రిలీజ్ చేయడానికి డిజిటల్ - శాటిలైట్ డీల్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించబోతోంది. ఇదిలా ఉండగా సత్యదేవ్ నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News