ఆ పాత్ర నాకు నచ్చలేదు.. ఆ హీరో కోసమే చేశాను!

Update: 2022-06-07 00:30 GMT
సత్యరాజ్ కి తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ ఆయన హీరోగా చేసిన సమయంలో ఆ సినిమాలు అనువాదాలుగా ఇక్కడ విడుదలయ్యేవి కూడా. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో ఆయన కనిపిస్తూనే వచ్చారు. ఇక కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన 'మిర్చి' సినిమాలో కనిపించిన దగ్గర నుంచి ఇక్కడి ప్రేక్షకులకు చేరువవుతూ వచ్చారు. ఇక ఆ తరువాత ఆయన 'బ్రహ్మోత్సవం' .. ' హైపర్' .. ' 'జెర్సీ' .. ఇలా వరుస సినిమాలు  చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు .. 'బాహుబలి' సినిమాతో ఆయనకి వచ్చిన గుర్తింపు ఒక ఎత్తు.

హీరో  .. హీరోయిన్ తరువాత ఒక పాత్ర జనంలోకి వెళ్లడం .. ఒక పాత్రతో ప్రపంచ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా 'బాహుబలి' సినిమాలో హీరో - హీరోయిన్ తరువాత సత్యరాజ్ పోషించిన 'కట్టప్ప' పాత్రకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాత్ర చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సీక్వెల్ కి థియేటర్స్ ను రప్పించిన ఘనత కూడా ఈ పాత్రకే దక్కుతుంది. ఈ మధ్యకాలంలో అంతగా ప్రభావితం చేసిన పాత్ర  మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.

అలాంటి సత్యరాజ్ షారుక్ హీరోగా చేసిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో తాను నటించడం  తనకి ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2013 ఆగస్టులో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీపికా పదుకొణే కథానాయికగా నటించింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ కథ చెన్నై నేపథ్యంలో జరుగుతుంటుంది. అందువలన నేటివిటీ కోసం వాళ్లు సత్యరాజ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఏ సినిమా గురించిన విషయాలను గురించి సత్యరాజ్ ప్రస్తావించాడు.

 "షారుక్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'లో నేను హీరోయిన్ తండ్రి పాత్రను పోషించాను. ఆ పాత్రను గురించి నాకు చెప్పినప్పుడు .. అది అంత గొప్పగా అనిపించలేదు. ఆ పాత్ర నాకు అంతగా నచ్చలేడీనే  షారుక్ తోను .. దర్శకుడితోను చెప్పాను. కానీ  చివరికి  చేయవలసి వచ్చింది. షారుక్ అంటే నాకు  ఎంతో ఇష్టం .. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాను.

ఆయన పట్ల గల అభిమానంతోనే ..  కేవలం ఆయన కోసమే ఆ సినిమా చేశాను" అని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇంతకాలం తరువాత ఆయన బయటికి చెప్పడమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
Tags:    

Similar News