ఇంకా స‌త్తా చూపిస్తాన‌న్న న‌గ్మ‌

Update: 2019-02-15 07:07 GMT
మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఘ‌రానా మొగుడు` చిత్రంలో న‌టించారు న‌గ్మ‌. చిరుతో పోటీప‌డుతూ పొగ‌రుమోతు కంపెనీ ఓన‌ర్ గా న‌గ్మ న‌ట ప్ర‌ద‌ర్శ‌నను మెగాభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. న‌గుమోము న‌గ్మా ఒడ్డు పొడుగు చూసి.. `అరేబియ‌న్ గుర్రం` అన్న బిరుదును కూడా ఇచ్చారు అప్ప‌ట్లో. నాగార్జున స‌ర‌స‌న కిల్ల‌ర్, వార‌సుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లోనూ న‌టించారు. నాడు అగ్ర క‌థానాయ‌కులంద‌రి స‌ర‌స‌న న‌టించి టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా న‌గ్మ  కొన‌సాగారు.  ఇటు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు, బాలీవుడ్ లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన న‌గ్మ ఆ త‌ర్వాత టీమిండియా కెప్టెన్ సౌర‌వ్ గంగూలీతో ఎఫైర్ న‌డిపించార‌న్న ప్ర‌చారం సాగింది.

గ‌తం గ‌తః అనుకుంటే వ‌ర్త‌మానంలో న‌గ్మ ఏం చేస్తున్నారు? అంటే..  ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలిగా రాజ‌కీయాల్లోనూ యాక్టివ్ గా కొన‌సాగుతున్నారు. అప్ప‌ట్లో ఓ ప‌బ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ వృద్ధ నాయ‌కుడు ఒక‌రు న‌గ్మ బుగ్గ‌పై ముద్దు పెట్టే ప్ర‌య‌త్నానికి సంబంధించిన‌ వీడియో అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అయ్యింది. అటుపైనా రాజ‌కీయాల్లో జోరు పెంచారు న‌గ్మ‌. ప్ర‌స్తుతం చాలా గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీ హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. నిన్న‌టిరోజున రాజ‌ధానిలో జ‌రిగిన టీఎస్సార్ జాతీయ అవార్డుల వేడుక‌లో న‌గ్మ అప్పియ‌రెన్స్ యూత్ లో మ‌రోమారు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ వేదిక‌పై న‌గ్మ‌కు జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు టీఎస్సార్. ఇప్ప‌టికే టీఎస్సార్ అవార్డుల‌కు జూరీ మెంబ‌ర్ గా ఉన్న న‌గ్మ ఈ పుర‌స్కారాన్ని అందుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

అదంతా అటుంచితే.. జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం అందుకోవ‌డం అంటే లైఫ్ అయిపోయిన‌ట్టు కాదు! ముందుంది ముస‌ళ్ల పండుగ‌!! అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం యూత్ లో చర్చ‌కు వ‌చ్చింది. తిరిగి సినిమాల్లోకి వ‌స్తున్నాన‌ని, వ‌చ్చే లోక్ స‌భ‌ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాన‌ని న‌గ్మ ప్ర‌క‌టించ‌డం వేడెక్కించింది. త‌న మాట‌ల్ని బ‌ట్టి న‌గ్మ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేశార‌నే అర్థ‌మ‌వుతోంది. ఇక ఎంపీ అయ్యాక న‌గ్మ తిరిగి ముఖానికి రంగేసుకుంటారా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకున్నారంతా. అన్న‌ట్టు ఇప్ప‌టికే భారీగా బ‌రువు పెరిగిన న‌గ్మ న‌టించాల‌నుకుంటే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. న‌దియ, ర‌మ్య‌కృష్ణ అంత స్లిమ్ముగా ఏమీ క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టి అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌ల వ‌ర‌కూ ప‌రిమితం కావాల్సి ఉంటుంది. ఈనెల 17న వైజాగ్ క్రికెట్ మైదానంలో టీఎస్సార్ పుర‌స్కారాల్ని అందించ‌నున్నారు. ఈ వేదిక‌పై న‌గ్మ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నారు.
Tags:    

Similar News