షారుఖ్‌ సినిమా.. సెన్సేషనల్‌ కాన్సెప్ట్‌

Update: 2015-07-09 11:30 GMT
అమీర్‌ ఖాన్‌ సినిమాలు వచ్చినపుడల్లా అతడి మీద ప్రశంసలు కురవడమే కాదు.. షారుఖ్‌ మీద సెటైర్లు కూడా పడుతుంటాయి. ఫాలోయింగ్‌ విషయంలో అమీర్‌ ఖాన్‌ కంటే ఓ మెట్టు పైనే ఉంటాడు కానీ.. అతడు కొన్నేళ్లుగా నాసిరకం సినిమాలు తీస్తూ పేరు మొత్తం పోగొట్టుకున్నాడు. అమీర్‌ సినిమా సినిమాకూ ఎదుగుతుంటే.. షారుఖ్‌ పతనమైపోతున్నాడు. పోయినేడాది 'హ్యాపీ న్యూ ఇయర్‌' భారీగా కలెక్షన్లయితే రాబట్టింది కానీ.. క్రిటిక్స్‌ అదో చెత్త అని తేల్చేశారు. అంతకుముందు వచ్చిన సినిమాల సంగతీ అంతే. చివరగా 'ఓం శాంతి ఓం' మాత్రమే కాస్త మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కంటెంట్‌ మీద కాకుండా కలెక్షన్ల మీదే దృష్టిపెట్టి చెత్త సినిమాలు తీస్తున్నాడంటూ.. అమీర్‌తో పోల్చి అతణ్ని తిట్టిపోస్తున్నారు క్రిటిక్స్‌. 3 ఇడియట్స్‌, పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రాలతోనూ కలెక్షన్ల పంట పండిండొచ్చని అమీర్‌ నిరూపిస్తుంటే షారుఖ్‌ మాత్రం ఈ రొడ్డకొట్టుడు సినిమాలే ఎందుకు చేస్తాడన్నది అతడిపై ఉన్న విమర్శ. నటన పరంగా చూస్తే అమీర్‌కు షారుఖ్‌ ఏమాత్రం తీసిపోడన్నది కూడా వాస్తవం.

ఐతే 'హ్యాపీ న్యూ ఇయర్‌'పై వచ్చిన విమర్శల తర్వాత షారుఖ్‌లో కొంచెం మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. బాద్‌షా కొత్త సినిమా 'ఫ్యాన్‌' చాలా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో షారుఖ్‌.. షారుఖ్‌ ఫ్యాన్‌గా నటిస్తుండటం విశేషం. అందుకోసం అవతారం పూర్తిగా మార్చేశాడు. ఇటీవలే షారుఖ్‌ ఇంటి ముందు అతణ్ని కలవడం కోసం తపించే అభిమానిగా పోలీసుల దెబ్బలు తినే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఓ హీరో తన అభిమానిగా తనే నటించడమన్నది సెన్సేషనల్‌ కాన్సెప్ట్‌ అన్నట్లే. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదంటున్నారు. అదే నిజమైతే పాటలు లేకుండా వస్తున్న తొలి షారుఖ్‌ సినిమా ఇదే అవుతుంది. బ్యాండ్‌ బాజా బారత్‌, శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌ లాంటి సినిమాలు రూపొందించిన మనీశ్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. షారుఖ్‌ ఫేవరెట్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ 'యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌' ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. షారుఖ్‌ చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News