వర్మ మోసం చేశాడంటున్న షణ్ముక ప్రియ

Update: 2018-10-08 10:59 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వివాదంతో మీడియా ముందుకు వచ్చాడు. అయితే ఈసారి ఆయన క్రియేట్‌ చేసిన వివాదం కాకుండా షణ్ముక ప్రియ అనే మహిళ ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక, తమిళనాడుతో పాటు సౌత్‌ రాష్ట్రాలను గడగడలాడ్డించిన వీరప్పన్‌ ఎన్‌ కౌంటర్‌ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ఒక చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. వీరప్పన్‌ ఎన్‌ కౌంటర్‌ సమయంలో ఆయన గురించి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చిన వ్యక్తి షణ్ముక ప్రియ. అందుకే ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ సమయంలో వర్మ ఆమె నుండి కీలకమైన సమాచారంను రాబట్టుకున్నాడు.

ఆమె ఇచ్చిన కీలక పాయింట్ల కారణంగా చాలా నేచురల్‌ గా సినిమా ఎన్‌ కౌంటర్‌ సీన్స్‌ వచ్చాయని కూడా కన్నడంలో టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఆమె వర్మపై కేసు వేసింది. వీరప్పన్‌ చిత్రం సమయంలో తన నుండి సమాచారం తీసుకున్నందుకు భారీ మొత్తంలో నాకు పారితోషికం ఇస్తాను అంటూ వర్మ ఒప్పందం చేసుకున్నాడు. అందుకు గాను ఒక లక్ష రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చాడు. అగ్రిమెంట్‌ చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మిగిలిన బ్యాలన్స్‌ ఇవ్వడం లేదు.

ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే తర్వాత, కొన్ని రోజులు ఆగు అంటూ సమాధానం వస్తుందని షణ్ముక ప్రియ చెప్పుకొచ్చింది. అందుకే ఇక చివరి ప్రయత్నంగా కేసు ఫైల్‌ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. వర్మ ఇవ్వాల్సిన మొత్తంతో పాటు, తనకు గతంలో కేంద్ర ప్రభుత్వం 5 కోట్లు మరియు ఉద్యోగం, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు నగదు బహుమానం ఇస్తామని ప్రకటించాయి. కాని నాకు ఇప్పటి వరకు ఏ ఒక్కరి నుండి సాయం అందలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు మోసం చేయడంతో పాటు, వర్మ కూడా తనను మోసం చేశాడు అంటూ షణ్ముక ప్రియ పేర్కొంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News