మళ్లీ ఫ్లాప్ తీసి.. మల్లి హ్యాట్రిక్

Update: 2015-10-31 11:30 GMT
ఓ డైరెక్టర్ కి ఒక ఫ్లాప్ వస్తేనే.. కోలుకోవడానికి చాలా కాలం పడుతోంది. స్టార్ డైరెక్టర్లకే చేతిలో ఉన్న సినిమాలు జారిపోయే పరిస్థితి. అలాంటిది ఓ డైరెక్టర్ పై నమ్మకముంచి వరుసగా ఒకే హీరో ఛాన్సులివ్వడమంటే మాటలా ? రెండు సూపర్ ఫ్లాప్స్ ఇచ్చాక మళ్లీ అదే హీరో.. అదే డైరెక్టర్ తో సినిమా చేయగలడా?

కళ్యాణ్ రామ్ మాత్రం అదే చేశాడు. అభిమన్యు - కత్తి లాంటి అట్టర్ ఫ్లాప్ లను తన ఖాతాలో వేసిన మల్లిఖార్జున అలియాస్ మల్లి చేతిలోనే షేర్ ను పెట్టాడు. ఆయన మాత్రం యథావిథిగా ఫ్లాప్ సినిమానే అందించాడు. మొదట కళ్యాణ్ రామ్-మల్లి కాంబినేషన్ లో వచ్చిన అభిమన్యులో మంచి స్టోరీ ఉన్నా.. డైరెక్టర్  తప్పిదాల కారణంగానే ఫెయిల్ అయింది. ఆ తర్వాత కత్తి విషయానికొస్తే.. కథ కంటే టైటిల్ గురించే ఎక్కువ రచ్చ జరిగింది.

ఇక లేటెస్ట్ మూవీ షేర్. పేరులో తప్ప ఆ గర్జనలు మూవీలో ఎక్కడా వినిపించలేదు. కళ్యాణ్ రామ్ లాంటి సూపర్ టైమింగ్ ఉన్న హీరోతో కనీసం యావరేజ్ లెవెల్లో కూడా కామెడీ చేయించలేకపోయాడు. ఇక కథ గురించి మాట్లాడుకోక పోవడమే బెటర్. కారణాలేమైనా మరో ఫ్లాప్ ని దిగ్విజయంగా అందించి హ్యాట్రిక్ సాధించాడు మల్లి.

షేర్ క్లిక్ అయితే.. టాలీవుడ్ కి ఓ అద్భుతమైన డైరెక్టర్ దొరుకుతాడు.. ఇదీ ఆడియో ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ కామెంట్. ఇప్పుడది ఫ్లాప్ టాక్ వచ్చేసింది కాబట్టి.. అద్భుతాలు సృష్టించే డైరెక్టర్ గా మల్లికి ఎలిజిబిలిటీ లేనట్లే. అయినా.. 'కత్తి' లాంటి ఓ హీరో వరుసగా ఓ ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశమిస్తే అతగాడిని ఏమనాలి. నిజంగా ఆ హీరో 'షేర్' కదా. కానీ డైరెక్టరే 'అభిమన్యు'డిలా యుద్ధం మధ్యలో ఆగిపోయాడు.
Tags:    

Similar News