ప్రతి అనుభవాన్ని పాఠంగానే భావించిన శోభన్ బాబు

Update: 2021-05-29 08:30 GMT
తెలుగు తెర అందాల నటుడు .. శోభన్ బాబు. తెరపై ఆయన ఎంత హుందాగా కనిపిస్తారో, బయటకూడా ఆయన అంతే డీసెంట్ గా వ్యవహరించేవారు. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం .. ఆ మాయను దాటుకుని జీవితాన్ని చక్కబెట్టుకోవడం కొంతమంది వలన మాత్ర్రమే అవుతుంది. అలాంటివారిలో శోభన్ బాబు ముందు వరుసలో కనిపిస్తారు. కెరియర్ తొలినాళ్లలో అవకాశాలు లేక ఆర్ధికంగా ఆయన అనేక ఇబ్బదులు పడ్డారు. అందువల్లనే ఆ తరువాత డబ్బు విషయంలో ఆయన అంతగా జాగ్రత్తపడ్డారు.

తాను ప్రత్యక్షంగా చూసిన కొన్ని సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడం .. తన విషయంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం శోభన్ బాబుకు అలవాటు. ట్రెండు మారుతూ ఉంటుంది .. కొత్త హీరోలు వస్తుంటారు .. పాత హీరోల క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. అందువలన నిలకడలేని క్రేజ్ ను గురించి అతిగా ఆలోచన చేయకూడదని ఆయన భావించేవారట. అంతేకాదు .. డబ్బు విషయంలో జాగ్రత్తపడని కొంతమంది ఆర్టిస్టులు, ఓపిక లేని చివరి రోజుల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడటం ఆయన చూశారు. అలాంటి పరిస్థితి తనకి రాకూడదని మరింత జాగ్రత్త పడ్డారు.

ఇక శోభన్ బాబును నిర్మాతగా రంగంలోకి దింపడానికి చాలామంది ప్రయత్నించారట. నిర్మాతలుగా వచ్చి ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న వాళ్లను చాలామందినే చూసిన శోభన్ బాబు, సినిమా నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నారట. తన స్థాయికి తగని పాత్రలను పోషించే పరిస్థితి రాకుండా, తన క్రేజ్ తగ్గకుండా ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. శోభన్ బాబు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే, రెండోసారి దాని గురించిన ఆలోచన చేయరు. ఆ లక్షణమే ఆయనను కుబేరుడిని చేసింది .. విజేతగా నిలబెట్టింది.    
Tags:    

Similar News