మూవీ రివ్యూ : శౌర్య

Update: 2016-03-04 09:15 GMT
చిత్రం : శౌర్య 

నటీనటులు: మంచు మనోజ - రెజీనా - ప్రకాష్ రాజ్ - సుబ్బరాజు - బ్రహ్మానందం  - నాగినీడు - శ్రవణ్ - ప్రభాస్ శీను - షాయాజి షిండే - బెనర్జీ - శివారెడ్డి - వేణు తదితరులు
సంగీతం: వేద.కె
ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి
స్క్రీన్ ప్లే: గోపీమోహన్ - హరి
మాటలు: దశరథ్ - కిషోర్ గోపు
నిర్మాత: మాల్కాపురం శివకుమార్
కథ - దర్శకత్వం: దశరథ్

మంచు మనోజ్-దశరథ్.. అస్సలు మ్యాచ్ అవ్వని కాంబినేషన్ ఇది. ఐతే వీళ్లిద్దరూ కలిసి దశాబ్దం కిందట ‘శ్రీ’ అనే సినిమా చేశారు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దశరథ్ - మనోజ్ ఇద్దరూ ఇప్పుడు తమ శైలికి భిన్నంగా ‘శౌర్య’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి వీరి కొత్త ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ:

శౌర్య (మంచు మనోజ్) హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న కుర్రాడు. నేత్ర (రెజీనా) ఓ ఎంపీ కూతురు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఐతే వీళ్ల పెళ్లికి నేత్ర కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. దీంతో ఇద్దరూ కలిసి యూకే వెళ్లిపోవాలనుకుంటారు. అక్కడికి బయల్దేరే ముందు నేత్రకు ఎంతో ఇష్టమైన శివాలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారు. అక్కడే జాగారం చేసి.. పడుకుని పొద్దున లేచేసరికి ఎవరో నేత్ర గొంతు కోసేస్తారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించి.. శౌర్యను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అందరూ నేత్రను శౌర్యనే చంపాలనుకున్నాడనుకుంటారు. ఇంతకీ నేత్ర గొంతు కోసిందెవరు? ఆమె ప్రాణాలతో బయటపడిందా లేదా? నిజానికి ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

థ్రిల్లర్ మూవీస్ అంటే వాటి వ్యవహారమే వేరుగా ఉంటుంది. సూటిగా లీడ్ పాయింట్ చుట్టూనే కథ నడపాలి. ఎక్కడా డీవియేట్ కాకూడదు. పకడ్బందీ కథనం ఉంటే తప్ప ఆ జానర్ సినిమాలకు ప్రేక్షకులు కనెక్టవ్వరు. ఈ జానర్లో రెగ్యులర్ పాటలు - డ్యూయెట్లు - ఫ్యామిలీ ఎమోషన్లు - కామెడీ.. ఇవన్నీ ఇమడవు. ఇవన్నీ పెట్టుకుని సినిమా తీయాలనుకున్నపుడు.. ఇక థ్రిల్లర్ల జోలికి వెళ్లకపోవడమే బెటర్. ‘శౌర్య’ సినిమాలో ప్రధాన ఇబ్బంది ఇదే. కథగా చెప్పుకుంటే ‘శౌర్య’ బాగానే అనిపిస్తుంది. కానీ ఇబ్బందంతా కథనంతోనే.

సినిమా ఆరంభంలోనే హీరోయిన్ గొంతు కోసేయడం.. ఇంటర్వెల్ సమయానికి ఆమె గొంతు కోసింది తనేనని కోర్టులో హీరో ఒప్పుకోవడం.. చివరికి వచ్చేసరికి అసలు కథంతా బయటపడటం.. ఇలా ‘శౌర్య’లో థ్రిల్ కలిగించే అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ థ్రిల్లర్ కథకు సరిపోయే మూడ్ లో కథనాన్ని నడిపించడంలోనే దశరథ్ విఫలమయ్యాడు. థ్రిల్లర్స్ లో ఉండే ఉత్కంఠ ఈ సినిమాలో మిస్సయింది. ఆరంభంలో ప్రేక్షకులకు ఒక షాక్ ఇచ్చాక.. దాని వెనుక ఏం జరిగి ఉంటుందనే ఉత్కంట ప్రేక్షకుల్లో రేకెత్తించేలా ఆసక్తికర సన్నివేశాలు పడలేదు. ఏమాత్రం ఆసక్తి కలిగించని బోరింగ్ లవ్ ట్రాక్ కారణంగా కాసేపటికే ప్రేక్షకుల్ని నీరసం ఆవహించేస్తుంది. పాటలు, కామెడీ ట్రాక్ విసుగు పుట్టిస్తాయి. ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాక కానీ.. కథనంలో కథలిక రాదు.

ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు ద్వితీయార్ధం మీద ఆసక్తి రేకెత్తిస్తాయి. ఐతే సెకండాఫ్ లోనూ మళ్లీ అదే తప్పు చేశాడు దశరథ్. బ్రహ్మానందం పాత్రను ప్రవేశ పెట్టి దాని చుట్టూ అల్లిన కామెడీ ట్రాక్ కారణంగా సినిమా పూర్తిగా గాడి తప్పుతుంది. ఇది చాలదన్నట్లు అక్కడొక పాట కూడా. ఓ థ్రిల్లర్ మూవీలో అందులోనూ రెండు గంటల తక్కువ నిడివిలోనూ ఇలాంటి  కామెడీ ట్రాకులు - పాటల అవసరం ఏమొచ్చిందో దర్శకుడికే తెలియాలి. పోనీ ఆ కామెడీ ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. చివరి అరగంట మాత్రమే కథనం సజావుగా సాగుతుంది.

తెర వెనుక ఏం జరిగిందో విప్పే సన్నివేశాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విలన్ల ఆటకట్టించేందుకు హీరో నడిపిన డ్రామా ఆసక్తి రేపుతుంది. ఢిల్లీ జూలో మనిషిని పులి చంపేసిన సంఘటనకు సంబంధంచి హీరో చెప్పిందాంట్లో లాజిక్, నిజం ఎంత అన్నది పక్కనబెడితే.. దాన్ని ఈ కథకు రిలేట్ చేసిన తీరు బాగుంది. సినిమాకు ముగింపు కూడా బాగానే అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ‘శౌర్య’ మంచి ఫీలింగ్ కలిగించడు. కథ వరకు బాగానే అనిపించినా.. కథనమే పెద్ద మైనస్ అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాకు అతకని రెగ్యులర్ కమర్షియల్ అంశాల్ని చేర్చే ప్రయత్నం చేయడమే సినిమాకు పెద్ద మైనస్ అయింది.

నటీనటులు:

మంచు మనోజ్ లుక్ మాత్రమే కాదు.. నటన కూడా కొత్తగా అనిపిస్తుంది. మనోజ్ ను ఇలా ఎప్పుడూ చూసి ఉండం. ముందు ఈ పాత్రలో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాడు కానీ.. కాస్త అలవాటయ్యాక ఓకే అనిపిస్తుంది. నటన ఓకే. రెజీనాది కథలో కీలక పాత్రే కానీ.. ఆమె టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం రాలేదు. గ్లామర్ కోణంలో ఆమెను చూస్తే నిరాశ తప్పదు. ప్రకాష్ రాజ్ చాన్నాళ్ల తర్వాత ఓ ముఖ్యమైన పాత్ర చేశాడు. ఆయన బాగానే చేశాడు. ప్రభాస్ శీను కామెడీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు నవ్వించాడు. కొన్నిసార్లు విసిగించాడు. బ్రహ్మానందం గురించి చెప్పడానికేమీ లేదు. నాగినీడు - సుబ్బరాజు - నందు - షాయాజి షిండే - బెనర్జీ.. వీళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

కొత్త సంగీత దర్శకుడు వేద.కె పర్వాలేదనిపించాడు. టుప్ప టుప్ప పాట వైవిధ్యంగా ఉంది కానీ అది సినిమాలో సెట్టవ్వలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ ఒకటి వినసొంపుగా ఉంది. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. మల్హర్ భట్ ఛాయాగ్రహణంలో కూడా మామూలే. సినిమాటోగ్రాఫర్ ప్రత్యేకతను చూపించే సన్నివేశాలేం లేవు. థ్రిల్లర్ సినిమాలకు తగ్గ మూడ్, టెంపో కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం జరగలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దశరథ్-కిషోర్ కలిసి రాసిన మాటలు సోసోగా అనిపిస్తాయి. ‘‘పెళ్లి చూసేవాళ్లకు ఘనంగా అనిపించడం కాదు.. చేసుకునేవాళ్లకు సంతోషాన్నివ్వాలి’’.. లాంటి డైలాగులు కొన్ని బాగున్నాయి. గోపీమోహన్.. హరితో కలిసి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో తరహాలోనే వెళ్లిపోయారు గోపీ - హరి. ఇక దర్శకుడు దశరథ్ తన శైలికి భిన్నమైన థ్రిల్లర్ జానర్ ను డీల్ చేయడంలో విఫలమయ్యాడు. కథ విషయంలో మెప్పించినా.. దాన్ని సమర్థంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు. దర్శకుడిగా దశరథ్ వీకెస్ట్ మూవీస్ లో ‘శౌర్య’ ఒకటనడంలో సందేహం లేదు.

చివరగా: అంత థ్రిల్లేమీ లేదయ్యా శౌర్య

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Tags:    

Similar News