చిక్కడు దొరకడు.. సూపర్ టైటిలెహే

Update: 2016-03-14 08:07 GMT
మంచి సినిమా తీస్తే లాభం లేదు.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి జనాలకు చేరువ చేయడం ముఖ్యం ఈ రోజుల్లో. ఆ ప్లానింగ్ లేకే ఓ మంచి సినిమా అడ్రస్ లేకపోయింది. ఆ సినిమా పేరు.. చిక్కడు దొరకడు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా ఇది. తమిళంలో ‘జిగర్ తాండా’ పేరుతో తెరకెక్కింది. అక్కడ సెన్సేషనల్ హిట్టయింది. ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ఇన్నొవేటివ్ ఐడియాతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. తమిళంలోనే కాదు.. ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదంటూ ‘జిగర్ తాండా’పై ప్రశంసల జల్లు కురిపించారు విమర్శకులు. బాలీవుడ్ జనాలు సైతం ఈ సినిమాను అప్రిషియేట్ చేశారు. ఇందులో విలన్ పాత్ర పోషించిన బాబీ సింహాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాను చూద్దామని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు కానీ.. వారికా భాగ్యం దక్కలేదు.

ఏడాదిన్నర కిందట రిలీజవ్వాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 11న సినిమా రిలీజ్ అన్నారు. విడుదలకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. సినిమా ఆ రోజులు విడుదల కాలేదు. ఈ చిత్రానికి ఓ మోస్తరుగానే థియేటర్లు ఇచ్చారు కానీ.. సినిమా చూద్దామని వెళ్లిన జనాలకు నిరాశే ఎదురైంది. సినిమా ఎందుకు రిలీజవ్వలేదో కారణం కూడా చెప్పేవాళ్లు లేరు. సినిమా జర్నలిస్టులు విషయమేంటో తెలుసుకుందామని చూసినా.. సమాధానం చెప్పే నాథుడు లేడు. టీవీల్లో, పత్రికల్లో పబ్లిసిటీ చేసి.. థియేటర్ల దగ్గర పోస్టర్లు కూడా అంటించి.. చివరికి సినిమా రిలీజే లేకుండా చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా కథ ఇంతటితో ముగిసినట్లే కనిపిస్తోంది. టీవీల్లో వస్తే చూసుకోవాల్సిందే తప్పితే.. థియేటర్లలో మాత్రం ఈ సినిమా చూడ్డం కష్టమే. మొత్తానికి ‘చిక్కడు దొరకడు’ అని ఈ సినిమాకు భలే సూటబుల్ టైటిల్ మాత్రం పెట్టారండీ.
Tags:    

Similar News