జగమంత కుటుంబం మీది.. శాస్త్రి గారూ..!

Update: 2021-11-30 12:21 GMT
ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల.. ఈరోజు మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తన కలంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ.. ఎన్నో సినిమాల విజయానికి దోహదపడిన సిరివెన్నెల కలం శాశ్వితంగా మూగబోయింది. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి తిరిగిరాని లోకాలను వెళ్లడం సినీ అభిమానులను శోక సముద్రంలో ముంచెత్తుతోంది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి చేంబోలు ప్రస్తుత వయసు 66 సంవత్సరాలు. 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. ఆయనకు భార్య పద్మావతి.. ఇద్దరు కుమారులు యోగి - రాజా చేంబోలు ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన శాస్త్రి.. అప్పట్లో 'భరణి' కలం పేరుతో కవిత్వం రాసేవారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'జననీ జన్మభూమి' సినిమాతో సీతారామశాస్త్రికి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 'సిరివెన్నెల' చిత్రంలో అన్ని పాటలు రాసిన సీతారామశాస్త్రి పేరు ముందు అదే టైటిల్ ఇంటి పేరుగా మార్చుకునే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

'స్వయంకృషి' 'స్వర్ణ కమలం' 'సంసారం ఒక చదరంగం' 'శృతి లయలు' 'ఇంద్రుడు చంద్రుడు' 'నిన్నేపెళ్లాడతా' 'గాయం' 'అంతం' 'అల్లుడు గారు' 'శుభలగ్నం' 'క్షణ క్షణం' 'మనీ' 'సిందూరం' 'మురారి' 'ఒక్కడు' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'చక్రం' 'కొత్తబంగారు లోకం' 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. ఇలా ఎన్నో చిత్రాలోని పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని వేల పాటలు.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న RRR చిత్రంలోని 'దోస్తీ' పాట కూడా ఆయన రాసిందే. సిరివెన్నెల చివరగా నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కోసం రెండు పాటలు రాశారు.

సీతారామశాస్త్రి గేయ రచయతగానే కాకుండా.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాయం' సినిమాలో నటుడిగా మెరిసారు. 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని' అంటూ తను రాసిన పాటలోనే అభినయించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా, సినిమాలో ఒక్క పాటయినా రాయించాలని దర్శక నిర్మాతలు తపిస్తుంటారు. సిరివెన్నెల తనయుడు రాజా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇక సీతారామ శాస్త్రికి దర్శకుడు త్రివిక్రమ్ అల్లుడి వరుస అవుతారు. ఆయన సోదరుడి కూతురుని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. సిరివెన్నెల 37 యేళ్ల సినీ ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు రచించారు. తన సాహిత్యంతో ఎన్నో చిత్రాలను సూపర్ హిట్స్ చేశారు. సాహిత్యంతో జనాన్ని పులకింప చేసి ఎన్నో అవార్డులు సొంత చేసుకున్నారు. 'సిరివెన్నెల' పాటలతో తొలి నంది అవార్డును అందుకున్న సీతారామశాస్త్రి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 సార్లు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.  2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగులో పద్మ అవార్డు అందుకున్న రెండో సినీ గేయ రచయత సీతారామశాస్త్రి.

తెలుగులో శ్రీశ్రీ - ఆత్రేయ -ఆరుద్ర - దాశరథి - కొసరాజు - వేటూరి వంటి ప్రసిద్ధ గేయ రచయితల సరసన సిరివెన్నెల సీతారామశాస్త్రి స్థానం సంపాదించుకున్నారు. ప్రేక్షకులను పరవశింపజేసెలా అన్ని రకాల జోనర్లలో పాటలు రాశారు. చివరి వరకు రాస్తూనే వచ్చారు. సమాజ కవిగా కూడా పేరుగాంచిన సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోనే చెప్పాలి. సిరివెన్నెల మృతి యావత్ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూరుకుంటూ.. సీతారామశాస్త్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News