టైటిల్ పోస్టర్: కంగనా ప్రధాన పాత్రలో 'సీత: ది ఇంకార్నేషన్'

Update: 2021-09-14 12:32 GMT
ఇతిహాస రామాయణం.. ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా తనవి తీరని మహాకావ్యం అంటుంటారు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో 'బాహుబలి' 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాల రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ రామాయణం ఆధారంగా ''సీత: ది ఇంకార్నేషన్'' అనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ దర్శకుడు అలౌకిక్‌ దేశాయి తెరకెక్కించే ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మీద చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతాదేవి పాత్ర కోసం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ని ఖారారు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

'సీత' సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఎంతోమందిని సంప్రదించిన మేకర్స్.. చివరకు నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న కంగనా రనౌత్ నే ఫైనలైజ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగనా.. ఝాన్సీ లక్ష్మీబాయి - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రల్లో మెప్పించింది. ప్రస్తుతం 'ధడక్' 'తేజస్' సినిమాలతో పాటుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సీతాదేవి పాత్రలో నటించడానికి రెడీ అయింది. ఈరోజు మంగళవారం 'సీత' చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..దర్శక నిర్మాతలు టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ''ఎండమావి అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఎన్నడూ అన్వేషించని పవిత్రమైన పాత్ర కల ఇప్పుడు నిజమైంది. సీతగా కంగనా రనౌత్‌ని తీసుకురావడంపై నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని అన్నారు. భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాత సలోని శర్మ తెలిపారు. ''సీత: ది ఇంకార్నేషన్'' చిత్రాన్ని హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మనోజ్‌ ముంతాషీర్ ఈ చిత్రానికి సాహిత్యం మరియు సంభాషణలు సమకూరుస్తున్నారు.

ఇదివరకు రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాకు భిన్నంగా.. 'సీత: ది ఇంకార్నేషన్' సినిమాని సీతాదేవి కోణంలో ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని.. ఎవరికీ తెలియని సరికొత్త ‘సీత’ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News