రెమో నుంచే మ‌నోడి క‌న్ను ప‌డిందా?

Update: 2022-07-17 02:30 GMT
త‌మిళ హీరోలు టాలీవుడ్‌ పై ప్ర‌త్యేక దృష్టిని పెడుతున్నారు. మ‌న వాళ్లు పాన్ ఇండియా అంటూ ప‌రుగులు పెడుతుంటే కోలీవుడ్ హీరోలు మాత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుని ఇక్క‌డ కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఇప్ప‌టికే ధ‌నుష్, స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తో పాటు యంగ్ హీరో శివ కార్తికేయ‌న్ కూడా రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్ప‌టికే తెలుగులో త‌మ డ‌బ్బింగ్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్నా స్ట్రెయిట్ మూవీస్ తో ఆక‌ట్టుకోబోతున్నారు.  

ధ‌నుష్ `సార్‌` మూవీతో తెలుగులో ప‌రిచ‌యం అవుతుండ‌గా శివ కార్తికేయ‌న్ `ప్రిన్స్‌`తో రంగంలోకి దిగ‌బోతున్నాడు. ఇక విజ‌య్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లితో బై లింగ్వల్ మూవీ `వార‌సుడు`తో రాబోతున్న విష‌యం తెలిసిందే.

 అయితే ఈ ముగ్గురు తమిళ హీరోల్లో యంగ్ హీరో శివ కార్తికేయ‌న్ టాలీవుడ్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టున్నాడు. 2016 డిసెంబ‌ర్ లో విడుద‌లైన `రెమో` తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

తెలుగులో త‌న సినిమాకు అనూహ్య ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో శివ‌కార్తికేయ‌న్ క‌న్ను టాలీవుడ్ పై అప్ప‌డే ప‌డింద‌ని చెబుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌త్యేకంగా చెన్నై నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన శివ‌కార్తికేయ‌న్ అప్ప‌టి నుంచి తెలుగులో ఏ సినిమా విడుద‌లైనా వెంట‌నే ఇక్క‌డ వాలిపోతున్నాడు. ఇక గ‌త ఏడాది విడుద‌లైన `వ‌రుణ్ డాక్ట‌ర్` మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం, మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి శివ‌కార్తికేయ‌న్ కెరీర్ లోనే భారీ విజ‌యాన్ని సొంతం చేసుక‌న్న సినిమాగా నిలిచింది. 40 కోట్ల‌తో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 100 కోట్ల ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగులోనూ మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో అప్ప‌టి నుంచి తెలుగు ఇండ‌స్ట్రీపై శివ‌కార్తికేయ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డం మొద‌లు పెట్టాడు.

అనుదీప్ తో `ప్రిన్స్‌` మూవీని చేస్తున్నఈ యంగ్ హీరో `మ‌హావీరుడు` పేరుతో రూపొందుతున్న మ‌రో సినిమాని కూడా తెలుగు కోసం రెడీ చేస్తున్నాడు. నిత్యం ఇక్క‌డి వారితో ట‌చ్ లో వుంటూ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో క‌లిసిపోతున్నాడు. స్టార్ హీరోల‌తోనూ మంచి అనుబంధాల‌ని ఏర్ప‌ర‌చుకుంటూ టాలీవుడ్ లో పాగా వేస్తున్నాడు.
Tags:    

Similar News