టాలీవుడ్ లో ఎలాగైనా ఒక హిట్టుకొట్టి తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు అల్లు బ్రదర్ శిరీష్. మరికొన్ని రోజుల్లో ఒక వినూత్న కథతో 'ఒక్క క్షణం' అంటూ మనముందుకు రాబోతున్నాడు. రిలీజ్ టైమ్ లో కూడా తనకు ఎవరు పోటీ రాకుండా ఉండేలా డేట్ ను సెట్ చేసుకున్నాడు. అయితే సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందా లేదా? అనేది రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేము.
కానీ చిత్ర యూనిట్ మాత్రం అందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిత్ర యూనిట్ సినిమాలోని ఒక మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసింది. మణిశర్మ స్వరపరచిన ఆ సాంగ్ కొంచెం కొత్తగా ఉంది. సో మెనీ సో మెని.. అంటూ లిరిక్స్ స్వీట్ గా మొదలవ్వడం చూస్తుంటే యువతని ఆకట్టుకునే విధంగా ఉందనిపిస్తోంది.
అనురాగ్ కులకర్ణి - సాహితి గాత్రం కూడా మణిశర్మ ట్యూన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. రామజోగయ్య శాస్త్రి రచన కూడా ఇద్దరి లవర్స్ మధ్య మెలోడీ ప్రేమను ఊహల్లో గుర్తిచేస్తున్నట్లు ఉంది. మరి సినిమాలో విజువల్ గా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.