బాలయ్యపై తొడ కొట్టబోతున్న నాగ్

Update: 2015-11-16 17:30 GMT
ఇప్పటికే సంక్రాంతి పందెం కోళ్లు ఎక్కువైపోతున్నాయని అనుకుంటుంటే కొత్తగా ఇంకో కోడి పందేనికీ నేనూ రెడీ అంటోంది. ఆ కోడి బాగా సీనియర్ కూడా. నందమూరి అబ్బాయి, బాబాయి సినిమాలు సంక్రాంతికి కన్ఫమ్ అని తేలిపోయినా.. ఇంకా ఒకట్రెండు చిన్న సినిమాలు కూడా పండక్కే రాబోతున్నాయని తెలిసినా.. అక్కినేని కథానాయకుడు నాగార్జున కూడా తన సినిమాను సంక్రాంతికే తేవాలని ఆశ పడుతున్నాడు. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రిలీజ్ డేట్ విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్సుకి తెరదించేశాడు నాగ్. జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని చెప్పేశాడు.

జనవరి 8న ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి సందడికి తెర తీయబోతుండగా.. 14న బాలయ్య సినిమా ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ మరుసటి రోజే తన సినిమాను విడుదల చేసి బాలయ్యతో సమరానికి దిగబోతున్నాడు నాగ్. వీళ్లిద్దరి మధ్య కొన్నేళ్లుగా సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో ఈ బాక్సాఫీస్ సమరం ఆసక్తి రేపేదే. ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన వారానికి తన సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు కాబట్టి థియేటర్ల సమస్య ఉండదని.. మిగతా చిన్న సినిమాలేవైనా ఉన్నా అవి పోటీ కాదని, సెలవుల అడ్వాంటేజీ ఉంటుంది కాబట్టి, బాలయ్యతో పోటీ పడ్డా ఇబ్బంది లేదని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News