ఆయ‌న‌కిస్తే భార‌త‌ర‌త్న సంతోషిస్తుంది

Update: 2020-09-29 23:30 GMT
దేశం గర్వించదగ్గ చిత్రకారుడు బాపు. తన చిత్రకళకు తోడు అద్భుతమైన సినిమాలతో కోట్లాది మందికి ఆనందాన్నిచ్చాడు. భారతీయ కళా రంగానికి ఆయన చేసిన సేవలు అసమానమైనవి. అలాంటి దిగ్గజానికి ఒక్క పద్మ పురస్కారం ఇవ్వడానికి ప్రభుత్వాలకు దశాబ్దాలు పట్టింది. బాపు ప్రతిభకు, ఆయన చేసిన సేవకు పద్మవిభూషణ్ ఇవ్వాల్సింది. అది కూడా కొన్ని దశాబ్దాల ముందే. కానీ చాలా ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఒక పద్మశ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిన్నా మొన్నా వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు పద్మశ్రీలు ఇచ్చి పడేస్తుంటారు. కానీ బాపు జీవిత చరమాంకంలో కానీ పద్మ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. ఇక దిగ్గజ నటుడైన కైకాల సత్యనారాయణకు ఇప్పటికీ పద్మశ్రీ దక్కలేదు. ఇక ఈ పురస్కారాల గురించి ఏం మాట్లాడుకోవాలి?

ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకంటే.. ఇటీవలే కాలం చేసిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మొదలైంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. ఐతే గత కొన్ని దశాబ్దాల్లో భారతరత్న పురస్కారాల ప్రకటనలు చూస్తే.. చాలా వరకు రాజకీయ కోణంలోనే ఇచ్చిన సంగతి అర్థమవుతుంది. కేంద్రంలో అధికారం చెలాయించేది ఉత్తరాది నేతలే కావడంతో అక్కడి వారికే పురస్కారాలు కట్టబెడుతుంటారు. దక్షిణాది వారంటే ఎప్పుడూ చిన్నచూపే. మరి బాలు విషయంలో ఏం చేస్తారన్నది ప్రశ్న. తన పాటలతో పదుల కోట్లమందికి ఆనందాన్ని పంచిన వ్యక్తి బాలు. గాయకుడిగానే కాదు.. నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆయన ప్రతిభ, సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.

గతంలో భారతరత్న అందుకున్న వారు చాలామందితో పోలిస్తే బాలు ఎన్నో మెట్లు పైన ఉంటారు. భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే ఒక అరుదైన గాయకుడు బాలు. ఏ ప్ర‌మాణాల ప్ర‌కారం చూసినా బాలు భారతరత్నను వంద శాతం అర్హుడు. ఆయ‌న‌కు భార‌తర‌త్న ఇస్తే ఆ పుర‌స్కారం స్థాయి పెరుగుతుంది. ఆ అవార్డు కూడా బాలును వ‌రించినందుకు సంతోషిస్తుంది.తన పాటలతో దేశ‌వ్యాప్తంగా తరతరాలను అలరించిన ఆ దిగ్గజ గాయకుడికి మరో ఆలోచన లేకుండా భారతరత్న ఇచ్చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా నార్త్-సౌత్ తేడాలు చూసి, రాజకీయ కోణంలో ఆలోచించి బాలుకు ఆ పురస్కారం ఇవ్వకపోతే అంత‌కంటే అన్యాయ‌మైన విష‌యం మ‌రొక‌టి ఉండ‌దు.

Tags:    

Similar News