ఈ లైకుల పిచ్చేంటి సామీ...

Update: 2018-03-24 23:30 GMT
టాలీవుడ్‌లో త‌రాలు మారే కొద్దీ - రికార్డుల‌కి అర్థం మారుతూ వ‌చ్చింది. ఒక‌ప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింద‌నే దాన్ని బ‌ట్టి - సినిమా ఎంత పెద్ద హిట్టు అనేది తెల్చేవారు. శ‌త దినోత్స‌వాలు - సిల్వ‌ర్ జూబ్లీ - ద్విశ‌త‌క దినోత్స‌వాలు - త్రి శ‌త‌క దినోత్స‌వాలు - ఏడాది - 500 రోజులు... అంత‌కు మించి ఆడిన సినిమాలు అని ఆ లెక్కే వేరుగా ఉండేది. ఆ త‌ర్వాత  త‌రంలో రికార్డుల మీనింగ్ మారిపోయింది.

ఎన్ని ఎక్కువ రోజులు అనేదాని కంటే ఎన్ని ఎక్కువ సెంట‌ర్ల‌లో ఆడింది అనేది రికార్డుగా చెప్పుకునేవాళ్లు. మా హీరో సినిమా ఇన్ని సెంట‌ర్ల‌లో 50 రోజులు ఆడింది, ఇన్ని సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది... అంటూ గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు అభిమానులు. బాల‌య్య‌బాబు ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ సినిమాతో ఆరంభ‌మైన ఈ ట్రెండు - ఎన్‌ టీఆర్ ‘సింహాద్రి’ - చిరంజీవి ‘ఠాగూర్‌’ - మ‌హేష్‌ బాబు ‘పోకిరి’ - రామ్‌ చ‌ర‌ణ్ ‘మ‌గ‌ధీర‌’  సినిమాల దాకా విప‌రీతంగా సాగింది. హీరోలు సెంట‌ర్ల విష‌యంలో అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగేవి. అయితే ఆ త‌ర్వాత వంద రోజులు ఆడే సినిమాల సంఖ్య బాగా త‌గ్గిపోవ‌డంతో ఈ ట్రెండ్‌ కు శుభం కార్డు ప‌డింది. ఎన్ని త‌క్కువ రోజుల్లో ఎంత ఎక్కువ చేసింది - ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ - ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్... అంటూ కొత్త రికార్డులు ట్రెండ్‌ గా మారాయి.

అయితే ఎన్‌ టీఆర్ న‌టించిన ‘నాన్న‌కు ప్రేమ‌తో’ - ర‌జినీ ‘క‌బాలి’ టీజ‌ర్లు యూట్యూబ్ వ్యూస్ రికార్డుల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాయి. దాంతో టీజ‌ర్ విడుద‌ల‌యిన వెంట‌నే ఎంత త‌క్కువ స‌మ‌యంలో మిలియ‌న్‌ - 5 మిలియ‌న్‌ - 10 మిలియ‌న్ వ్యూస్ దాటితే అంత పెద్ద రికార్డు సెట్ చేసిన‌ట్టు లెక్క‌. అయితే దీనికి తోడు ఈ మ‌ధ్య మ‌రో పిచ్చి కూడా తోడైంది. అదే లైకులు. మిలియ‌న్ వ్యూస్ మాత్ర‌మే వ‌స్తే స‌రిపోదు... దానికి త‌గ్గ‌ట్టు లైక్స్ కూడా రావాలి.  దీని కోసం స‌ద‌రు సినిమా యూనిటే - ప్ర‌త్యేకంగా కొంద‌రు వ్య‌క్తుల‌ను నియమించి వ్యూస్‌ ను పెంచ‌డం - లైక్‌ లు కొట్టించ‌డం చేస్తున్నార‌ట‌.

యూట్యూబ్ గురించి - అందులో వీడియోల గురించి అత్తెస‌రు జ్ఞానం ఉన్న వారికి కూడా ఓ ప్రాంతీయ భాషా చిత్ర టీజ‌ర్‌ ప్ర‌పంచంలో అత్య‌ధిక లైకులు సాధించడం సాధ్య‌మేనా అనే విష‌యం అవ‌గ‌త‌మ‌వుతుంది. అందులో ఎన్ని ఫేక్ వ్యూస్ ఉన్నాయో.. ఎన్ని కొట్టుడు లైక్స్ ఉన్నాయో అనే విష‌య‌మూ తెలిసిపోతుంది. అయినా ఎందుకీ లైక్స్ పిచ్చి అంటే.. వ‌చ్చే స‌మాధానం ఒక్క‌టే రికార్డుల పిచ్చి - వెర్రి అభిమానం.
Tags:    

Similar News