జేపీ వీడియోల ప్రసారం ఆపండి

Update: 2020-09-08 17:31 GMT
టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి ఈ ఉదయం  తన స్వస్థలమైన గుంటూరులోని ఇంట్లో తుదిశ్వాస విడిచాడు. 74 ఏళ్ల జేపీ గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న వీడియోలు ఇప్పుడు అన్ని మీడియా, యూట్యూబ్ చానెల్స్ లో వైరల్ అవుతున్నాయి.  కొన్ని మీడియా సంస్థలు అయితే జేపీ చివరిక్షణాలు అంటూ  ఆ విజువల్స్ ప్రదర్శించడం ద్వారా రక్తికట్టిస్తున్నాయి. జేపీ మృతదేహం వీడియో, అతను తన ఇంటి బాత్రూంలో గుండెపోటుతో ఎలా చనిపోయాడో చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. అనేక టాప్ తెలుగు టీవీ ఛానెళ్లలో ఇది ప్రసారం అవుతోంది.

గత ఆరునెలల నుండి ఎటువంటి పని లేకుండా చాలా మంది నటులు  ఇంట్లోనే ఉన్నారు. కరోనా-లాక్డౌన్  వల్ల ఈ పరిస్థితి దాపురించింది.  దీంతో వయసు సంబంధిత అనారోగ్యం.. ఒత్తిడి వారిని వెంటాడుతోంది.. ఆ ఒత్తిడి కారణంగా, నటుడు జయ ప్రకాష్ కుటుంబంతోపాటు ఉండడానికి హైదరాబాద్ వదిలి  తన కుటుంబం ఉన్న గుంటూరుకు వచ్చాడు. సినిమాలు, షూటింగ్ లు బంద్ కావడంతో ఆ ఒత్తిడితోనే జేపీ కూడా చనిపోయినట్టు ఉన్నాడు. ఈ క్రమంలో మీడియాలో మాత్రం దీన్ని చిలువలు పలువలుగా చూపిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఇటీవలి కాలంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెడ్ బాడీ విజువల్స్ కూడా మీడియాలో ఇలానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు జెపి డెడ్ బాడీ విజువల్స్ కూడా యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సమాజంలోని అన్ని ప్రాంతాల నుండి వస్తున్న  అభ్యర్థన ఏమిటంటే, అలాంటి విజువల్స్ ప్రసారం చేయడాన్ని ఆపివేయాలని అందరూ కోరుతున్నారు.  ఎందుకంటే  నిన్నటి దాకా తెరపై నవ్వించిన జేపీని అలా చూపించడం అందరికీ ఇబ్బందిగా ఉందంటున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులకు.. అభిమానులను ఆ వీడియోలు తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఆ వీడియోలు జేపీ సన్నిహితులకు చేదు జ్ఞాపకంగా వెంటాడుతాయి.    

ఇప్పటికైనా టీవీ ఛానెల్స్ మరియు యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటి సున్నితమైన విషయాల్లో సంయమనం పాటించాలని.. ప్రసారం చేయకుండా ఉండాలని కోరుతున్నారు.
Tags:    

Similar News