ఈగ విలన్.. కేరాఫ్ కాంగ్రెస్

Update: 2018-05-06 06:53 GMT
కర్ణాటకలో రసవత్తర ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు భారతీయ జనతా పార్టీ.. మరోవైపు జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది అక్కడ. ఎన్నికల సమయంలో సెలబ్రెటీల్ని ప్రధాన పార్టీలు ఆకర్షించి తమ తరఫున ప్రచారం చేయించుకోవడం మామూలే. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు ప్రముఖ నటీనటులు వివిధ పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు. కొందరు ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. మన సాయికుమార్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే... కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన సుదీప్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం.

‘ఈగ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న సుదీప్.. ఇటీవలే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ప్రకటించాడు. ముందు సుదీప్ జేడీఎస్ వైపు వెళ్తాడని ప్రచారం జరిగింది. ఐతే సుదీప్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని అతడిపై సిద్ధరామయ్య ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన పార్టీ వైపు లాగాడు. సిద్ధరామయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సుదీప్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నాడు. ఈ ఎన్నికల్లో సిద్ధరామయ్య రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇటు బాదామిలో.. అటు చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయన బరిలో ఉన్నారు. రెండు చోట్లా కవర్ చేయడం కష్టం కాబట్టి సుదీప్ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. రెండు చోట్లా గెలిచి.. పార్టీని కూడా గెలిపించుకుంటే సిద్ధరామయ్యే తర్వాతి ముఖ్యమంత్రిగా కూడా కొనసాగడం ఖాయం. మరోవైపు భాజపా.. యువ కథానాయకుడు యశ్ ను తమ పార్టీ వైపు లాగింది. సుదీప్ కు పోటీగా సిద్ధరామయ్య పోటీ చేసే నియోజకవర్గాల్లో అతడితో ప్రచారం చేయించనుంది.

Tags:    

Similar News