సంస్కారం మీరు నేర్పాలా సుధీర్ బాబూ

Update: 2018-05-04 05:24 GMT
సుధీర్ బాబు కొత్త సినిమా సమ్మోహనం వస్తోంది. ఈ మూవీపై తుపాకి.కామ్ వెబ్ సైట్ లో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. వీటిలో ఒకదానిపై స్పందిస్తూ తుపాకి.కాం వెబ్ సైట్ ను - తుపాకి రిపోర్ట‌ర్‌ ను కించపరుస్తూ నిన్న హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. 'ఈ వెబ్ సైట్ నా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక్క పాజిటివ్ న్యూస్ రాస్తుందని అనుకోవడం లేదు. చిరంజీవి గారితో మాట్లాడడం పై కూడా నెగిటివ్ రాయగలరు. నీ వెబ్ సైట్ కు కరెక్టుగా "తు""పాకి" అని పేరు పెట్టుకున్నావు' అని రాసుకొచ్చాడు సుధీర్ బాబు.

మా గురించి ఏం రాసినా సుధీర్ బాబు గారి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. ఆయన వ్య‌క్తీక‌రించిన అభిప్రాయాన్ని ఆయ‌నలాగా మేము గుడ్డిగా కొట్టిపారేయ‌ద‌ల‌చుకోలేదు. పైగా ఆయ‌న వ్య‌క్తీక‌ర‌ణ‌ను మెచ్చుకుంటున్నాం. కానీ తుపాకి.కాం వెబ్ సైట్ లో సమ్మోహనం గురించి చాలానే ఆర్టికల్స్ వచ్చాయి. ఇంద్రగంటి మేకింగ్ పై.. టీజర్ లో చూపించిన విజువల్స్ పై.. పలు పాజిటివ్ విశ్లేష‌ణ‌లు చేస్తూ ప్రశంసలు కూడా కురిపించాం. బ‌హుశా అవేవీ మన హీరో సుధీర్ బాబు గారికి అసలు కనిపించ‌లేదో - లేక‌పోతే క‌న్వీనియెంట్‌ గా వ‌దిలేశారో మరి (కింద లింక్స్ ఇచ్చాం). పైగా సుధీర్‌ గారు ప్ర‌స్తావించిన‌ ఆర్టికల్ అంతా... ఆయన చిరంజీవి గారితో మాట్లాడిన మాటలు మాత్రమే ఉన్నాయి. చివ‌రి పేరాలో చిరంజీవి గారిని ఈ వయసులో లవ్ స్టోరీ చేయమని అడగడంపై.. ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశాడు. అందులో సుధీర్‌ బాబు గారు గుర్తించిన  కుసంస్కారం ఏంటో మాకైతే అర్థం కావ‌డం లేదు. మేము రాసింది ఒక ప్రైవేటు వీడియో పై కాదు. ప‌బ్లిక్ కు విడుద‌ల చేసిన వీడియో.  ఒక పాపుల‌ర్ మీడియా సంస్థ‌గా దానిపై స్పందించే హక్కు గాని - స్వేచ్ఛ‌గాని *తుపాకి*కి ఉన్నాయి. ఆ క‌నీస పాత్రికేయ ధ‌ర్మాన్ని - నియ‌యాన్నిగుర్తించ‌కుండా ఏకంగా తుపాకి పోర్టల్ ను - జ‌ర్న‌లిస్ట్‌ను అవమానపరిచేలా కామెంట్ చేసి తన సంస్కారం ఎంత గొప్పదో సుధీర్ బాబు ప్రపంచానికి చాటి చెప్పుకున్నారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. సుధీర్ బాబు తను చేసిన ట్వీట్స్ కు వచ్చిన కామెంట్స్ చదువుకుంటాడో లేదో తెలియదు కానీ.. ఒకసారి జనాల రియాక్షన్ కూడా తెలుసుకుంటే త‌త్వం ఆయ‌న‌కే బోధ‌ప‌డుతుంది. ఆ ట్వీట్‌ కు వివ‌రంగా స్పందించిన వారిలో అత్య‌ధికులు తుపాకి వార్త మీకెందుకు త‌ప్పుగా అనిపించింద‌ని సుధీర్‌ బాబును రిప్ల‌యి ద్వారా ప్ర‌శ్నించారు. వాటిలో ఒక‌టి -  'మీరు అంత దారుణంగా మాట విసరాలనేంత ఏముంది అందులో? మీ న్యూస్ ను ప్రెజెంట్ చేసి - లాస్ట్ పేరాగ్రాఫ్ లో ఆ జర్నలిస్ట్ అతగాడి కామెంట్ రాసాడు. దానికే మీరు ఎందుకు అంత ఇదయిపోయారో నాకు అయితే అర్థం కాలేదు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి రిప్ల‌యిలు బోలెడొచ్చాయి.

అఫ్ కోర్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్న సంగతి చెప్పుకునేందుకు తుపాకి.కాం ఏమీ సందేహించదు. కానీ తుపాకిని అక్క‌డ విమ‌ర్శించిన‌ వారు కూడా సుధీర్ బాబు అంత దారుణ‌మైన ప‌దాలైతే వాడ‌లేదు. మరి ఇక్కడ సంస్కారం నేర్చుకోవాల్సింది ఎవరో.. నేర్పాల్సింది ఎవరో.. మరోసారి తన ట్వీట్ ద్వారా సుధీర్ బాబు చెబితే తెలుసుకునేందుకు తుపాకి.కాం సదా సర్వదా సిద్ధం.

సమ్మోహనం గురించి తుపాకీ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్

టీజర్ టాక్: మోహంలో పడేసిన సమ్మోహనం


మహేష్ మాకు చాలా క్లోజ్ -మెగాస్టార్

'అందరివాడు' అనిపించేసుకుంటున్నాడు




Tags:    

Similar News