అసలు ఆ బయోపిక్ ఏమైందబ్బా?

Update: 2018-04-29 04:30 GMT
సినిమా ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్ ల హ‌వా బాగా న‌డుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్లోనే అనుకుంటే ఇప్పుడు టాలీవుడ్ కు చేరింది. ఓ ప‌క్క సావిత్రి బయోపిక్  విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే మ‌రో ప‌క్క ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. కొన్ని రోజుల క్రితం పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ పై కూడా వార్త‌లు న‌డిచాయి. సినిమా ప్ర‌క‌టించి నెల‌లు గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు షూటింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌లేదు. స‌రిక‌దా క‌నీసం ఆ సినిమా చేస్తారో లేదో అన్న అనుమానాలు ఎక్కువైపోయాయి.

దేశానికి పీవీ సింధు సైనా నెహ్వాల్ కిదాంబి శ్రీకాంత్ వంటి మంచి ఆట‌గాళ్ల‌ను అందించిన ఘ‌న‌త పుల్లెల గోపీచంద్‌కే ద‌క్కుతుంది. అలాంటి వ్య‌క్తి బ‌యోపిక్‌ను తీసేందుకు ముందుకొచ్చారు ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు. చంద‌మామ క‌థ‌లు గరుడ‌వేగ‌ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడాయ‌న‌.  గోపీచంద్‌ 44వ జన్మదినం సందర్భంగా  బ‌యోపిక్ విషయాన్ని ప్ర‌క‌టించారు. ఫాక్స్‌ స్టార్‌ స్టుడియో, అబండాన్షియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు క‌లిసి సినిమా నిర్మిస్తాయ‌ని ప్ర‌కటించారు. తెలుగు హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేస్తామ‌న్నారు. గోపీచంద్ పాత్రకు సుధీర్ బాబును ఎంపిక చేసుకున్నారు. సుధీర్ బాబు కూడా కొన్ని రోజుల పాటూ టెన్నిస్ శిక్ష‌ణ తీసుకున్నాడు. జాతీయ‌స్థాయిలో సినిమా గురించి వార్త‌లు వ‌చ్చాయి.

అంత ప్ర‌తిష్థాత్మ‌కంగా తీసుకున్న గోపీచంద్ బ‌యోపిక్ గురించి ఇప్పుడే వార్త‌లు రావ‌డం లేదు. చిత్ర‌యూనిట్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అస‌లు బ‌యోపిక్ ప్రాజెక్టు ఏమైందో తెలియ‌ని ప‌రిస్థితి. గ‌తంలో ప్ర‌క‌టించిన వివరాల ప్ర‌కారం ఈ మార్చి నుంచే షూటింగ్ ప్రారంభ‌మ‌వ్వాలి. ఏప్రిల్ వ‌చ్చేసినా ఇంకా ఎలాంటి క‌ద‌లిక రాలేదు. మేలో ప్రారంభ‌మ‌వుతుందేమో అనుకుంటున్నారు సినీజ‌నాలు. కానీ ఇంత‌వ‌ర‌కు సుధీర్ బాబుని త‌ప్ప ఇంకెవ‌రినీ ఎంపిక‌చేయ‌లేదు. అంటే బ‌యోపిక్ అట‌కెక్కిన‌ట్టేనే అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా సినిమా యూనిట్ స్పందిస్తే బావుంటుంది.
Tags:    

Similar News