అందర్లోకి సుకుమారే టాప్

Update: 2015-11-27 09:30 GMT
దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఐతే తమతో ఎవరూ సినిమా చేయని పరిస్థితుల్లోనో.. లేక తమ అభిరుచికి తగ్గట్లు రాజీ పడకుండా సినిమా తీసుకోవడానికో.. నిర్మాతలుగా మారారు చాలామంది. ఆ ప్రయత్నంలో ఎక్కువగా చేతులు కాల్చుకున్న వాళ్లే కానీ.. కమర్షియల్ గా సక్సెస్ అయిన వాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే. కానీ సుకుమార్ అలా కాదు. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే పెట్టుబడి కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ లాభాలు అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. బహుశా సినిమా మొదలుపెట్టినప్పుడు అతను ఈ పరిస్థితి అస్సలు ఊహించి ఉండడేమో. అతడే ఉద్దేశంతో సినిమా మొదలుపెట్టాడో కానీ.. పైసా పెట్టుబడి పెట్టకుండానే, దర్శకుడిగా కూడా ఓ సినిమాకు అందుకోనంత భారీ మొత్తంలో కోట్లకు కోట్లు వచ్చి అతడి ఖాతాలో పడుతున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ మీద నేరుగా పైసా పెట్టుబడి పెట్టలేదు. పెద్ద నిర్మాతల తరహాలోనే బ్రాండ్ వాల్యూతో ఈజీగా ఫైనాన్స్ సమకూర్చుకోగలిగాడు సుకుమార్. అలా అయినా సినిమాకు పెట్టింది ఐదు కోట్లకు అటు ఇటు అంతే. ఐతే సుక్కు ఫ్రెండ్స్ రత్నవేలు - దేవిశ్రీ ప్రసాద్ పైసా తీసుకోకుండా సినిమాకు పని చేశారు. యూనిట్లో ఇంకెవరికీ కూడా పెద్దగా పారితోషకాలు లేవు. ఐతే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ‘కుమారి...’ జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో అటు ఇటుగా ఓ 15 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా 10 కోట్ల షేర్ మార్కుకు దగ్గరైనట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు శాటిలైట్ కాలేదు. అది ఓ 4 కోట్ల దాకా పలికే అవకాశముంది. రీమేక్ రైట్స్ కోసం కూడా మంచి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి అటు ఇటుగా ఓ పాతిక కోట్లకు తక్కువ కాకుండా సుక్కుకి వర్కవుటయ్యే అవకాశముంది. తనను నమ్మి డబ్బులు తీసుకోకుండా సినిమా చేసిన అందరికీ లాభాలు పంచినా సుకుమార్ తక్కువలో తక్కువ పది కోట్లయినా సంపాదించబోతున్నట్లే ‘కుమారి 21 ఎఫ్’ ద్వారా. బహుశా నిర్మాతగా మారి ఈ స్థాయిలో లాభాలు అందుకున్న వాళ్లలో సుకుమారే ముందుంటాడేమో.

Tags:    

Similar News