ప్లాపుల్లో ఉన్న హీరో కూడా ముందుకొచ్చాడు..!

Update: 2020-04-08 14:54 GMT
ప్రపంచం మొత్తం కరోనా చేతిలో కీలు బొమ్మగా మారింది. ఆ కంటికి కనిపించని మహమ్మారి చెప్పినట్టే ఈ ప్రపంచం నడుచుకుంటోంది. మన దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కవ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతూ వస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. మరణాలు కూడా అధికమవుతున్నాయి. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ పై కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలు పెరుగ‌ని పోరాటం చేస్తున్నాయి. ఇప్ప‌టికే దేశ‌మంత‌టా లాక్‌ డౌన్‌ ను ప్ర‌క‌టించారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలికేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా - టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్‌‌ లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు - కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు రంగంలోకి దిగి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నారు. చిరంజీవి - నాగార్జున - ప్రభాస్ - మహేష్ - ఎన్టీఆర్ - బాలయ్య - ఇలా స్టార్ హీరోలతో పాటు దర్శకులు - నిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా పేద కళాకారులకు - కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు - కూరగాయలు - మందులు - కొంత ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నారు. ఈ రోజు మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి తన వంతుగా కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా యువ హీరో సందీప్ కిషన్ ప్రజలకు మాస్కులు పంచి పెడుతూ సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు. తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ మాస్కులు - శానిటైజర్స్ పంచి పెడుతూ వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా అందరూ తమకు సాధ్యమైన స్థాయిలో పేదవారికి సహాయం చేయమని పిలుపునిస్తున్నారు. ఈ విషయం తెలిసిన సందీప్ కిషన్ అభిమానులు అతని ఔదార్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగులో 'ఏ 1 ఎక్ష్ ప్రెస్' సినిమాతో పాటు తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకోగా - పరిస్థితులు అనుకూలించిన తర్వాత షూటింగులో పాల్గొంటాడని తెలుస్తోంది.
Tags:    

Similar News