‘ప్రస్థానం’లో ఛాన్స్ ఎలా వచ్చిందంటే...

Update: 2017-10-29 09:16 GMT
ఛోటా కె.నాయుడి మేనల్లుడే అయినా.. సినీ రంగంలోకి సందీప్ కిషన్ ఎంట్రీ అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. తన మావయ్య ఎవరినైనా కలిపించడంలో.. ఇంకో రకంగా సాయం చేశాడు తప్ప.. ఎక్కడా అవకాశాలు ఇప్పించలేదని.. తాను అవకాశాల కోసం ఆయన్ని ఒత్తిడి కూడా చేయలేదని సందీప్ పలుమార్లు చెప్పాడు. హీరోగా అవకాశం కోసం తాను ఎన్ని అవస్థలు పడింది కూడా గతంలోనే వివరించాడు సందీప్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్.. తాను హీరోగా మారే ముందు పడ్డ అవస్థల గురించి వివరించాడు. తనకు హీరోగా అవకాశమిస్తానని ఒక దర్శకుడు తనను హైదరాబాద్ పిలిపించి.. ఆ తర్వాత హ్యాండిచ్చాడని.. అప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఏడుస్తూ వెళ్లానని చెప్పాడు.

ఇక తన తొలి సినిమా ‘స్నేహగీతం’ కూడా మొదలయ్యాక అనుకోకుండా ఆగిపోయిందన్నాడు. ఆ సమయంలో తనకు అనుకోకుండా ‘ప్రస్థానం’లో నెగెటివ్ రోల్ చేసే ఛాన్స్ దక్కిందన్నాడు. తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ అవకాశం గురించి సందీప్ వివరించాడు. ‘‘స్నేహగీతం షూటింగ్ నాలుగు రోజులు చేసి ఆపేశారు. తర్వాత రెండు నెలలకు పైగా ఖాళీగా ఉన్నాను. అప్పుడు నాతో పాటు ఇంకో ఫ్రెండు కూడా రూంలో ఉండేవాడు. అతనూ సినిమా అవకాశాల కోసం చూస్తున్నాడు. అలాంటి సమయంలో నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన శర్వానంద్ అక్క ఫోన్ చేసి ‘ప్రస్థానం’లో మంచి నెగెటివ్ రోల్ ఉందని.. నీ ఫ్రెండుకు చెప్పమని చెప్పింది. నేను అతడికి ఫోన్ చేస్తే.. నువ్వు చేయకుండా నాకిస్తున్నావంటే అందులో ఏదో తేడా ఉంటుందని చెప్పి తిట్టి ఫోన్ పెట్టేశాడు. శర్వా వాళ్లక్క మళ్లీ ఫోన్ చేసి మంచి రోల్ అని.. నువ్వే ట్రై చెయ్ అని చెప్పింది. నేను ఆడిషన్ కు వెళ్తే.. దేవా కట్టా గారు నాకు వయసు తక్కువని.. ఆ పాత్రకు సూటవ్వనని అన్నారు. అయినా ఒకసారి ఆడిషన్ చేసి చూద్దామన్నారు. ఆడిషన్ అయ్యాక నేనే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అన్నాడు. అలా ఆ సినిమాలో నటించాను. ఆ సినిమాకు మంచి పేరొచ్చి నా కెరీర్ మలుపు తిరిగింది’’ అని సందీప్ చెప్పాడు.
Tags:    

Similar News