'అనుమతులొచ్చినా థియేటర్స్ రీ ఓపెన్ చెయ్యలేం'

Update: 2020-07-28 14:00 GMT
దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ ఇండస్ట్రీ గత నాలుగు నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు కొన్ని షరతులతో సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్స్ ఆపేసుకున్న కొన్ని సీరియల్స్ మరియు చిన్న సినిమాల చిత్రీకరణ స్టార్ట్ చేసారు. అయితే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అంటే మాములు విషయం కాదని చాలామంది ఫిలిం మేకర్స్ షూటింగ్స్ స్టార్ట్ చేయలేదు. ఇకపోతే ఎప్పుడూ కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులతో సందడిగా ఉండే థియేటర్స్ వెలవెలబోతున్నాయి. అయితే ఆగస్టు నెలలో థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొచ్చని.. 25 శాతం ఆక్యుపెన్సీ కండిషన్ తో థియేటర్స్ రీ ఓపెన్ చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్స్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో థియేటర్స్ రీ ఓపెనింగ్ పై స్పందించారు. ప్రభుత్వాలు అనుమతులిచ్చినా ఇప్పుడప్పుడే తన థియేటర్స్ పునః ప్రారంభించే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.

సురేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయడం అంటే రిస్క్ తీసుకున్నట్లేనని.. రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో థియేటర్ లో రెండున్నర గంటలకు పైగా ఆడియన్స్ కి కూర్చోబెట్టడం అంటే వారి లైఫ్ ని రిస్క్ లో పెట్టడమే అని అభిప్రాయపడ్డారు. థియేటర్స్ క్లోజ్ అవడంతో చాలా నష్టపోయాం. కానీ ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని.. అన్ని వ్యాపార కోణంలో ఆలోచించకూడదని చెప్పుకొచ్చారు. ఇటీవల కొన్ని దేశాల్లో థియేటర్స్ ఓపెన్ చేసారు.. కానీ కరోనా ప్రభావం పెరుగుతుండటంతో మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. మనం దీన్ని ఉదాహరణగా తీసుకొని ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇలాంటి సమయంలో థియేటర్స్ తెరవడానికి అనుమతిలిస్తాయని అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ ఆక్యుపెన్సీ తగ్గించుకొని థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రొడ్యూసర్స్ నష్టపోతారు. థియేటర్స్ లో ఒకరిద్దరికి కరోనా సోకిందని వార్తలు వచ్చినా ఫ్యూచర్ లో ప్రేక్షకులు మరింత దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వెయిట్ చేస్తే మంచిదని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 'నారప్ప' సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు గుణశేఖర్ - రానా కాంబినేషన్ లో 'హిరణ్యకశ్యప' అనే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్దపడుతున్నారు. ఇక బాలీవుడ్ లో విజయం సాధించిన 'సోనూ కే టిటు కి స్వీటీ' 'డ్రీమ్ గర్ల్' సినిమాలను తెలుగులో రీమేక్ చేయనున్నారు సురేష్ బాబు.
Tags:    

Similar News