ఇంత జ‌రుగుతున్నా బాబుగారి సంద‌డి క‌నిపించ‌దే?

Update: 2022-07-28 07:35 GMT
గత వారం రోజులుగా తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి, గిల్డ్ స‌భ్యులు వ‌రుసగా ఇండ‌స్ట్రీ కీల‌క వ్య‌వ‌హారాల‌పై భేటీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ మ‌ధ్య సినిమా నిర్మాణ వ్య‌యంతో పాటు టికెట్ రేట్లు, ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ లు తారా స్థాయిలో పెరిగిపోయాయ‌ని, దీంతో సినిమాల బ‌డ్జెట్ లు విప‌రీతంగా పెరిగాయ‌ని, వ‌స్తున్న రాబ‌డికి, పెట్టిన పెట్టుబ‌డికి ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌డం లేద‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు ఆగ‌స్టు 1 నుంచి సినిమాల నిర్మాణం తాత్కాలికంగా నిలిపి వేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండలి ప‌లు కీల‌క నిర్ణయాల‌ని వెల్ల‌డిస్తూ బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 10 వారాల త‌రువాతే పెద్ద సినిమాల‌ని ఓటీటీల‌కు ఇవ్వాల‌ని, చిన్న సినిమాల‌కు 6 వారాలు గ‌డువు వుంటే స‌రిపోతుంద‌ని త‌దిత‌ర కీల‌క నిర్ణ‌యాల‌ని ప్ర‌క‌టించింది. ఇక గిల్డ్ గ‌త కొంత కాలంగా తాము ఎదుర్కొంటున్న మూడు కీల‌క అంశాల‌ని నియంత్ర‌ణ పేరుతో మూడు మిటీల‌ని ఏర్పాటు చేసింది. 1) థియేట‌ర్ అండ్ ఎగ్జిబిట‌ర్ల క‌మిటి, 2 ) ఓటీటీ రిలీజ్ లని నియంత్రించే క‌మిటీ, 3) కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్షన్ స‌మ‌స్య‌ల‌ని నివారించే క‌మిటీ.. అంటూ ఇలా మూడు ప్ర‌ధాన క‌మిటీల‌ని ఏర్పాటు చేసింది.

ఇంత జ‌రుగుతున్నా..గిల్డ్ ఆగ‌స్టు 1 నుంచి సినిమా షూటింగ్ ల బంద్ కు పిలుపు నివ్వ‌డ‌మే కాకుండా మూడు ప్ర‌ధాన క‌మిటీని నియ‌మించినా అంతులో స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్ బాబు పేరు కానీ, ఆయ‌న యాక్టివిటీ కానీ క‌నిపించ‌క‌పోవ‌డం.. ఆయ‌న స్వ‌రం వినిపించ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌తంలో గిల్డ్ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా సైలెంట్ గా వుండ‌టం ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేదు.
 
స్టూడియో అధినేత‌గా ఎగ్జిబిట‌ర్ గా, డిస్ట్రిబ్యూట‌ర్ గా, నిర్మాత‌గా వున్న ఆయ‌న కీల‌క స‌మ‌యంలో ఎందుకు మౌనంగా వున్నార‌న్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ డి. సురేష్ బాబు గిల్డ్ స‌మావేశాల్లో పాల్గొన్నారా?  లేదా అన్న‌ది క్లారిటీ లేదు. గ‌త కొంత కాలంగా ఫిల్మ్ ఛాంబ‌ర్ , గిల్డ్ వేరు వేరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. సి. క‌ల్యాణ్ లాంటి నిర్మాత‌లు గిల్డ్ పై బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గిల్డ్ అంతా డొల్ల అంటూ మండిప‌డుతున్నారు.  

కానీ సురేష్ బాబు మాత్రం ఇంత జ‌రుగుతున్నా స్పందించ‌డం లేదు. దిల్ రాజు మాత్ర‌మే ముందుండి అంతా చూసుకుంటున్నారు. కార‌ణం ఏంటా అని ఆరాతీస్తే సురేష్ బాబు చాలా రోజులుగానే గిల్డ్ వ్య‌వ‌హారాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నార‌ట‌. ఆగ‌స్టు 1న షూటింగ్ ల బంద్ ప్ర‌క‌ట‌న కోసం స‌భ్యుల అభిప్రాయాల‌తో పాటు సంత‌కాలు తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే సురేష్ బాబు సున్నితంగా తిరస్క‌రించి డాక్యుమెంట్ పై సంతం చేయ‌లేద‌ని తెలుస్తోంది.

ఇక సురేష్ బాబు తో థియేట‌ర్స్ వ్యాపారంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ పేరు కూడా తాజా క‌మిటీల్లో వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అస‌లు తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News