కంచరపాలెంపై దర్శకేంద్రుడి ప్రత్యేక శ్రద్ద

Update: 2018-09-11 14:00 GMT
ఒకప్పుడు టాలీవుడ్‌ లో పెద్ద సినిమాలు మాత్రమే రాజ్యం ఏలేవి. పెద్ద సినిమాల జోరు ముందు చిన్న చిత్రాలు నిలిచేవి కాదు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోయింది. మంచి సినిమా అయితే చాలు ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సాక్ష్యమే ‘అర్జున్‌ రెడ్డి’ - ‘ఆర్‌ ఎక్స్ 100’ - ‘గీత గోవిందం’ తాజాగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఒకప్పుడు చిన్న చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడేవారు. వారికి సినిమాను విడుదల చేయాలంటే చుక్కలు కనిపించేవి. కాని ఇప్పుడు మాత్రం మంచి కాన్సెప్ట్‌ తో సినిమాలు తీస్తే ఎంతో మంది నిర్మాతలు ఆ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఆ కోవకు చెందుతుంది.

వెంకటేష్‌ మహా దర్శకత్వంలో విజయ ప్రవీణ పరుచూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఈ చిత్రం రానాకు నచ్చడం - ఆ తర్వాత సురేష్‌ బాబు చూడటం ఆయనకు కూడా బాగా నచ్చడంతో విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. రానా సమర్పకుడిగా వ్యవహరించడంతో కంచరపాలం కాస్త పెద్ద సినిమా అయిపోయింది. విడుదలకు ముందే పలువురు ప్రముఖ దర్శకులు మరియు నిర్మాతలు చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. దాంతో తాజాగా నిర్మాత సురేష్‌ బాబు సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించడం జరిగింది.

ఈ సక్సెస్‌ మీట్‌ లో నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులు మాస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ కు అలవాటు పడ్డారు. ఇలాంటి మంచి సినిమాలను మరచి పోతున్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆధరించాలని కోరాడు. దర్శకుడు రాఘవేంద్ర రావు గారు నాకు ఫోన్‌ చేసి ఎలాగైనా ఈ చిత్రం బాగా ఆడించు - ఇటువంటి సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. త్వరలో సక్సెస్‌ వేడుక నిర్వహించు - నేను వచ్చి అందరికి షీల్డులు ఇస్తాను అంటూ స్వయంగా ఫోన్‌ చేసి మరీ చెప్పారు అంటూ సురేష్‌ బాబు చెప్పుకొచ్చారు. త్వరలో శైలజ రెడ్డి అల్లుడు - యూటర్న్‌ చిత్రాలు వస్తున్న కారణంగా కంచరపాలెం థియేటర్లను తగ్గించవద్దనేది రాఘవేంద్ర రావు గారి సలహా అంటూ సురేష్‌ బాబు పేర్కొన్నారు. చిన్న చిత్రంపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రద్ద చూసి అందరు కూడా అభినందిస్తున్నారు.
Tags:    

Similar News