యాపిల్.. డిస్నీ.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

Update: 2019-12-10 01:30 GMT
అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ దెబ్బ‌కు జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గింద‌న్న ఆవేద‌న డిస్ట్రిబ్యూట‌ర్.. ఎగ్జిబిట‌ర్ల‌లో క‌నిపిస్తోంది.  ప్ర‌స్తుతం దీనిపై తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లు ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జాల ప్ర‌వేశం తెలుగు సినిమాకి తీవ్ర న‌ష్టం క‌ల‌గ‌జేయ‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు. అప్ప‌టికే థియేట‌ర్ల‌లో సినిమా ఆడుతుండ‌గానే ఆన్ లైన్ లో స్ట్రీమింగుకి వ‌చ్చేయ‌డం అన్న‌ది అంద‌రినీ షాక్ కి గురి చేస్తోంది. పంపిణీదారులకు అది న‌ష్టాల్ని మిగులుస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అయితే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ కాంటెస్ట్ స‌రైన‌దేనా? అని ఇండ‌స్ట్రీ డీన్.. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ డి.సురేష్ బాబును ప్ర‌శ్నిస్తే ఏమ‌న్నారో తెలుసా?  ఇక్క‌డ ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి ఆట ఆడుతారో చెప్ప‌లేం. ఇది బాగా డ‌బ్బున్న వాళ్లు ఆడే ఆట‌. డ‌బ్బును వెద‌జ‌ల్లుతారు. అది తిరిగి వ‌స్తుందా.. రాదా?  రిస్కా లాభ‌మా? అన్న‌ది కూడా చూడ‌రు! అంటూ ఓ టాప్ సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు. ఇప్ప‌టికే నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ ఇలా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంటెంట్  పై డ‌బ్బు వెద‌జ‌ల్లి చాలా న‌ష్టాల్లో ఉంద‌ని అన్నారు. 10-15 బిలియ‌న్ డాల‌ర్ల మేర నెట్ ఫ్లిక్స్ అప్పుల్లో ఉంద‌ని సురేష్ బాబు షాకిచ్చే విష‌యం చెప్పారు.

బాగా డ‌బ్బు ఉండి న‌ష్టం వ‌చ్చినా త‌ట్టుకోగ‌లిగేవాళ్లే ఈ ఆట ఆడ‌గ‌ల‌రన్న ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సూత్రాన్ని ఆయ‌న త‌న‌దైన శైలిలో విఫులంగా చెప్పారు. అంతేకాదు ఇండ‌స్ట్రీ మీద దాడి కేవ‌లం అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ తో ప‌రిమితం కాలేదు. మునుముందు మ‌రిన్ని విదేశీ కార్పొరెట్ దిగ్గ‌జాలు బ‌రిలో దిగుతున్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. యాపిల్ వ‌స్తోంది. వాళ్లు కూడా బిలియ‌న్ డాల‌ర్లు వెద‌జ‌ల్లేస్తాడు. వాడి గేమ్ ఏంట‌న్న‌ది మ‌న‌కు తెలీదు. డిస్నీ వ‌స్తోంది.. వాళ్లు ఎలా ఆడేస్తారో చెప్ప‌లేం... అంటూ సురేష్ బాబు త‌న బిజినెస్ మైండ్ లోంచి ఆణిముత్యాల్లాంటి కొన్ని విష‌యాల్ని ప్రెస్సుకి అర్థ‌మ‌య్యేలా చెప్పారు.


Tags:    

Similar News