సూర్య `హ‌లో బ్ర‌ద‌ర్` కాన్సెప్ట్ తో?

Update: 2020-03-18 03:49 GMT
గ‌జిని- సెవెంత్ సెన్స్- బ్ర‌ద‌ర్స్ లాంటి ప్ర‌యోగాలు చేశారు సూర్య‌. అయితే గ‌జిని సాధించినంత విజ‌యం ఇత‌ర సినిమాలు సాధించ‌లేదు. పెద్ద తెర‌పై సూర్య ద్విపాత్ర‌ల్లో క‌నిపించిన‌వి ఆశించినంత స‌క్సెస్ కాలేదు. అయినా ఆ త‌ర‌హా ప్ర‌యోగాలు మాత్రం ఆప‌లేద‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది.

సూర్య- కె.వి.ఆనంద్ కాంబినేష‌న్ లో `మాట్రాన్‌`(తెలుగులో బ్రదర్స్) చిత్రంలో కవలలుగా నటించిన సంగ‌తి తెలిసిందే. అయితే అందులో శ‌రీరాలు అతుక్కుని పుట్టే కవలలుగా నటించి న‌ట‌ విశ్వరూపం చూపించారు. సూర్య న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్పుడు మరోసారి ఆయన కవలలుగా కనిపించబోతున్నారు. అది కూడా యాక్షన్‌ ఎంటర్ టైనర్ల కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే హరి దర్శకత్వంలో ఈ త‌ర‌హా ప్ర‌యోగం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. కమర్షియల్‌ మాస్‌ ఎంటర్ టైనర్లతో విజయాలను అందుకున్న హరి దర్శకత్వంలో సూర్య ఇప్పటికే ఆరు- వేల్ చిత్రాల‌తో పాటు.. సింగం సిరీస్ లో మూడు చిత్రాలు చేశారు. సింగం సిరీస్ లో రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సూర్య వ‌రుసగా సినిమాల‌కు క‌మిట‌వుతున్నారు. గురు ఫేం సుధాకొంగర దర్శకత్వంలో `ఆకాశమే నీ హద్దురా` చిత్రంలో నటిస్తున్నారు. అతి తక్కువ ధరకే విమాన టికెట్లు విక్రయించి.. సామాన్యుడికి విమానం ఎక్కే అవకాశాన్ని కల్పించి సంచలనం సృష్టించిన ఎయిర్‌ డెక్కన్‌ ఫౌండర్‌ జి.ఆర్‌.గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కరోనా వైరస్‌ కారణంగా రిలీజ్‌ డేట్ లో క్లారిటీ లేదు.

అనంతరం తనకి వరుసగా ఐదు సూపర్‌ హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సూర్య సిద్ధమయ్యారు. ఇందులో సూర్య కవలలుగా కనిపిస్తారట. ఇద్దరిలో ఒకరు మంచివాడుగా.. మరోకరు చెడ్డవాడుగా మారతారట. దీంతో ఇందులో హీరో అతనే.. విలన్‌ అతనే అని అర్థమవుతుంది. `24`లోనూ సూర్య త్రిపాత్రాభినయం చేయడంతోపాటు హీరోగానూ.. విలన్ గానూ నటించిన విషయం విదితమే.
తమిళంలో సూర్య- హరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. అత్యంత వేగవంతమైన స్క్రీన్‌ప్లే తో సినిమాని పరుగులు పెట్టించే హరితో సూర్య సినిమా అనే సరికి ఇప్పుడు కోలీవుడ్ లో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. దీనికి `అరువా` అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇక హరి చివరగా 2018లో విక్రమ్‌ హీరోగా `స్వామి స్క్వేర్‌` చిత్రాన్ని రూపొందించగా.. అది పరాజయం పాలైంది. దీంతో సూర్యతో హిట్‌ కొట్టాలని హ‌రి క‌సిగా ప‌ని చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు తమ కాంబినేషన్ లో డబుల్‌ హ్యాట్రిక్ కావాల‌నే పంతంతో ఉన్నాడ‌ట‌.
Tags:    

Similar News