తెలుగులో డిజాస్టర్.. తమిళంలో హిట్టట

Update: 2019-06-12 09:25 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'కబాలి' తెలుగులో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. కానీ తమిళంలో మాత్రం ఆ చిత్రం బాగానే ఆడింది. అంతకుముందు శంకర్-విక్రమ్‌ ల ‘ఐ’ చిత్రం మన ప్రేక్షకుల తల బొప్పి కట్టేలా చేసింది. కానీ తమిళ ఆడియన్స్ దాన్ని కూడా హిట్ చేసి పెట్టారు. రజనీ సినిమాలు ‘కాలా’.. ‘పేట’ కూడా తెలుగులో విమర్శలు ఎదుర్కొని.. తమిళంలో బాగానే ఆడాయి. ఈ సినిమాల్లో మనకు నచ్చని అంశాలు వాళ్లకెలా నచ్చాయో అర్థం కాదు. తాజాగా ఈ కోవలోకి సూర్య సినిమా ‘ఎన్జీకే’ కూడా చేరినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. రసవత్తర మలుపులున్న పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పి.. సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల్ని నిద్ర పుచ్చేశాడు దర్శకుడు సెల్వ రాఘవన్. రాజకీయాల లోతుల్లోకి వెళ్లకుండా పైపైన ఏదో అలా చూపించేసి గొప్ప సినిమా తీసినట్లు ఫీలైపోయాడతను.

తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అని తొలి షోతోనే తేలిపోయింది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా హిట్టంటున్నారు. వంద కోట్ల వసూళ్లు సాధించినట్లు పోస్టర్లు వేస్తున్నారు. రెండో వారంలో కూడా సినిమా చాలా బాగా ఆడేస్తున్నట్లు పీఆర్వోలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది ఎగ్జాజరేషనా నిజమా అన్నది అర్థం కావడం లేదు. ఐతే ‘ఎన్జీకే’కు తమిళంలో కూడా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. సమీక్షకులు ఈ సినిమాను చీల్చి చెండాడారు. ప్రేక్షకుల స్పందన కూడా అలాగే కనిపించింది. ఐతే సినిమాను ప్రేక్షకులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని.. ఇదొక కల్ట్ మూవీ అని సూర్య, సెల్వ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో ‘హిడెన్ డీటైల్స్ ఆఫ్ ఎన్జీకే’ అంటూ వీడియోలు పెడుతున్నారు. సినిమా అంత గొప్పది ఇంత గొప్పది.. వెర్రి జనాలు అర్థం చేసుకోలేకపోయారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. కానీ వాళ్లెంతగా వివరణ ఇచ్చుకున్నా సినిమాలో విషయం లేదన్నది స్పష్టం. కానీ చిత్ర బృందం ప్రకటించుకున్న వసూళ్లు చూస్తే మాత్రం ‘ఎన్జీకే’ తమిళంలో హిట్ అనుకోవాల్సిందే.

Tags:    

Similar News